AWS: భారత్‌లో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు

AWS: భారత్‌లో క్లౌడ్‌ సేవలకు గిరాకీ పెరుగుతోందని అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ తెలిపింది. అందుకనుగుణంగా తమ క్లౌడ్‌ మౌలిక సదుపాయాలను విస్తరించనున్నట్లు పేర్కొంది. అందుకోసం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.

Updated : 18 May 2023 16:42 IST

ముంబయి: భారత్‌లో 2030 నాటికి క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో రూ.1.05 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే ప్రణాళికలను ‘అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (AWS)’ ప్రకటించింది. దేశంలో క్లౌడ్‌ సేవల (Cloud Services)కు పెరుగుతున్న గిరాకీని అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.

డేటా సెంటర్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లలో పెట్టనున్న ఈ పెట్టుబడుల వల్ల 1.31 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఏడబ్ల్యూఎస్‌ (AWS) అంచనా వేసింది. నిర్మాణాలు, వాటి నిర్వహణ, టెలీకమ్యూనికేషన్స్‌ సహా మరికొన్ని రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. 2016- 2022 మధ్య ఏడబ్ల్యూఎస్‌ (AWS) దేశంలో రూ.30,900 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తాజాగా ప్రకటించిన రూ.లక్ష కోట్లతో కలిపి 2030 నాటికి భారత్‌లో కంపెనీ పెట్టుబడులు రూ.1.36 లక్షల కోట్లకు చేరుతాయి. దీనివల్ల భారత స్థూల దేశీయోత్పత్తికి రూ.1.94 లక్షల కోట్లు సమకూరుతాయని కంపెనీ తెలిపింది.

కంపెనీకి భారత్‌లో రెండు డేటా సెంటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రీజియన్‌లు ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్‌ ఏషియా పసిఫిక్‌ (ముంబయి) రీజియన్‌ను 2016లో ప్రారంభించారు. ఏడబ్ల్యూఎస్‌ ఏషియా పసిఫిక్‌ (హైదరాబాద్‌) రీజియన్‌ను 2022లో తెరిచారు. మరింత పటిష్ఠమైన వర్క్‌లోడ్‌లను రన్‌ చేసేలా భారత కస్టమర్లకు ఈ రెండు రీజియన్‌లు ఎలాంటి జాప్యం లేకుండా సేవలు అందిస్తున్నాయని ఏడబ్ల్యూఎస్‌ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని