ఫోన్‌ ఛార్జింగ్‌ తక్కువగా ఉంటే రైడ్‌కు ఉబెర్‌ ఎక్కువ ఛార్జ్‌ చేస్తుందా? కంపెనీ ఏమంటోంది?

క్యాబ్‌ సేవలు (Cab Services) వినియోగించుకునే యూజర్ల ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్ (Phone Battery Charging) తక్కువగా ఉంటే వారి నుంచి ఉబెర్‌ (Uber) ఎక్కువ మొత్తం ఛార్జ్‌ చేస్తుందని బెల్జియంకు చెందిన ఓ వార్తా సంస్థ ఆరోపించింది. 

Published : 15 Apr 2023 02:03 IST

బ్రస్సెల్స్‌: క్యాబ్‌ సేవల (Cab Services) సంస్థ ఉబెర్‌ (Uber)పై బెల్జియంకు (Belgium)కు చెందిన ఓ వార్తా సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. క్యాబ్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికుల ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్ (Phone Battery Charging) తక్కువగా ఉంటే.. వారి నుంచి ఉబెర్‌ ఎక్కువ మొత్తం ఛార్జీలు వసూలు చేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు డెర్‌నియర్‌ హ్యూరే (Derniere Heure) అనే వార్తా సంస్థ ఓ పరిశోధన నిర్వహించగా అందులో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపింది. సాధారణ రుసుము కంటే ఆరు శాతం అదనంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించామని సదరు వార్తా సంస్థ వెల్లడించింది.

ఇందుకోసం ఒకే ప్రాంతానికి రెండు వేర్వేరు ఉబెర్‌ క్యాబ్‌లను బుక్‌ చేశారు. వాటిలో ఒక ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ 12 శాతం ఉండగా, మరో ఫోన్‌ ఛార్జింగ్ 84 శాతం ఉంది. రైడ్‌ ముగిసిన తర్వాత 84 శాతం ఛార్జింగ్‌ ఉన్న ఫోన్‌ నుంచి 16.6 యూరోలు, 12 శాతం ఛార్జింగ్ ఉన్న ఫోన్‌ నుంచి 17.56 యూరోలు వసూలు చేశారు. ఈ బుకింగ్స్‌ను ఒకసారి ఐఫోన్‌తో, మరోసారి ఆండ్రాయిడ్‌ ఫోన్‌తో చేయగా, ఇదే విధమైన వ్యతాసం చూపించినట్లు వార్తా సంస్థ పేర్కొంది.

ఈ ఆరోపణలను ఉబెర్‌ సంస్థ కొట్టిపారేసింది. యూజర్ల ఫోన్‌లో బ్యాటరీ ఛార్జింగ్‌ ఎంత ఉందనేది తెలుసుకోవడం ఉబెర్‌కు సాధ్యం కాదని తెలిపింది. ధరల్లో వ్యత్యాసం అనేది రైడ్‌ బుక్‌ చేసుకునే సమయం, అందుబాటులో ఉన్న డ్రైవర్ల డిమాండ్‌ను బట్టి ఉంటుందని పేర్కొంది. ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ ఆధారంగా రుసుము వసూలు చేయమని స్పష్టం చేసింది. 

గతంలో కూడా ఉబెర్‌ సంస్థపై ఇదే విధమైన ఆరోపణలు వచ్చాయి. 2016లో ఉబెర్‌ మాజీ ఆర్థిక విభాగాధిపతి కేత్ చెన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఫోన్‌ బ్యాటరీ తక్కువగా ఉన్న సమయంలో యూజర్లు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సుముఖంగా ఉన్నట్లు కంపెనీ గుర్తించిదని తెలిపారు. అయితే, ఉబెర్‌ మాత్రం ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ ఆధారంగా రుసుము వసూలు చేయడంలేదని పేర్కొన్నారు. వార్తా సంస్థ చేసిన ఆరోపణలపై సైబర్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యల వల్ల యూజర్ల వ్యక్తిగత డేటా భద్రతకు భంగం వాటిల్లడంతోపాటు, ఉబెర్‌ ధరల విధివిధానాలపై అనుమానాలు కలిగిస్తోందని ఆరోపిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు