Forex: మారక నిల్వల్లో 67 శాతం తగ్గుదల విలువ కోల్పోవడం వల్లే: శక్తికాంత దాస్‌

సెప్టెంబరు 23 నాటికి భారత ప్రభుత్వం· వద్ద 537.5 బిలియన్‌ డాలర్ల విదేశీయ మారక నిల్వలు ఉన్నట్లు శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు....

Published : 30 Sep 2022 19:02 IST

ముంబయి: సెప్టెంబరు 23 నాటికి భారత ప్రభుత్వం వద్ద 537.5 బిలియన్‌ డాలర్ల విదేశీయ మారక నిల్వలు ఉన్నట్లు శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ఏప్రిల్‌ నుంచి నిల్వలు తగ్గాయని తెలిపారు. అయితే, తగ్గిన విలువలో 67 శాతం డాలరు విలువలో మార్పు వల్లేనని పేర్కొన్నారు.

ఏప్రిల్ 2 నాటికి భారత్‌లో 606.475 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. సెప్టెంబరు 23 నాటికి అవి 537.5 బి.డాలర్లకు తగ్గాయి. వరుసగా ఎనిమిదో వారం నిల్వల్లో తగ్గుదల నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 28 వరకు డాలర్‌ విలువ 14.5 శాతం బలపడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రధాన కరెన్సీలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. అయితే, భారత రూపాయి విలువ ఇతర దేశాల కరెన్సీలకు అనుగుణంగానే చలిస్తోందని శక్తికాంత దాస్‌ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 7.4 శాతం తగ్గింది. రూపాయి మార్కెట్‌లోని పరిస్థితులకు అనుగుణంగా స్వేచ్ఛగా కదలాడుతుందని దాస్‌ పేర్కొన్నారు.

మారకం విలువ ఇంత ఉండాలని ఆర్‌బీఐకి లక్ష్యమేమీ లేదని శక్తికాంత దాస్‌ అన్నారు. అయితే, మార్కెట్‌లోని తీవ్ర ఒడుదొడుకుల్ని అరికట్టేందుకు మధ్యలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంటుందని గుర్తు చేశారు. ఎప్పుడు జోక్యం చేసుకోవాలన్నది మార్కెట్‌లోని పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామన్నారు. విదేశీ మదుపర్లు వరుసగా తొమ్మిది నెలల పాటు దేశీయ మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకున్నట్లు గుర్తు చేశారు. తిరిగి జులై-సెప్టెంబరులో 7.5 బిలియన్‌ డాలర్లు భారత విపణిలో వారు పెట్టుబడిగా పెట్టినట్లు తెలిపారు. మరోవైపు ఏప్రిల్‌-జులైలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 18.9 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని