Nitin Gadkari: మన్మోహన్‌ సింగ్‌కు దేశం రుణపడి ఉంది: నితిన్‌ గడ్కరీ

1991లో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చాయని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. వాటిని ప్రవేశపెట్టిన అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌కు దేశం రుణపడి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

Updated : 09 Nov 2022 10:01 IST

దిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh)కు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. మన్మోహన్‌ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను ఉద్దేశిస్తూ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో పేద వర్గాలకు లబ్ధి చేకూర్చే ఉదారవాద ఆర్థిక విధానాల్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దిల్లీలో మంగళవారం జరిగిన ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

1991లో ఆర్థిక మంత్రి హోదాలో మన్మోహన్‌ (Manmohan Singh) చేపట్టిన సంస్కరణలు భారత్‌కు కొత్త మార్గాన్ని చూపెట్టాయని గడ్కరీ (Nitin Gadkari) కొనియాడారు. ఆ సమయంలో తాను మహారాష్ట్రలో మంత్రిగా ఉన్నానని.. సంస్కరణల వల్లే రోడ్ల నిర్మాణానికి భారీ ఎత్తున నిధుల్ని సమీకరించగలిగానని గుర్తుచేసుకున్నారు. రైతులు, పేదల కోసం మరిన్ని ఉదారవాద సంస్కరణల్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక సంస్కరణలు దేశ అభివృద్ధికి ఎలా దోహదం చేస్తాయో చెప్పడానికి చైనాయే ప్రత్యక్ష ఉదాహరణ అని గడ్కరీ అన్నారు. అలాగే భారత్‌ ఆర్థికంగా వేగవంతమైన వృద్ధి సాధించాలంటే మరింత మూలధన పెట్టుబడి కావాలని తెలిపారు.

రోడ్లు, రహదారుల నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ సామాన్య ప్రజల నుంచి కూడా నిధుల సమీకరిస్తోందని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం కేంద్ర రోడ్డు, రహదారుల శాఖ 26 కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తోందని.. నిధులకు ఎలాంటి కొరత లేదని పేర్కొన్నారు. రోజుకు 60 కి.మీ రహదారుల నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐకి ఏటా రూ.40 వేల కోట్ల టోల్‌ రెవెన్యూ వస్తోందని.. అది 2024 ఆఖరు కల్లా రూ.1.40 లక్షల కోట్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని