దివీస్‌ లేబొరేటరీస్‌కు రూ.702 కోట్ల లాభం

దివీస్‌ లేబొరేటరీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.2,343 కోట్ల ఆదాయాన్ని, రూ.702 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.1,997 కోట్లు, నికరలాభం రూ.557 కోట్లు ఉన్నాయి.

Published : 13 Aug 2022 02:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: దివీస్‌ లేబొరేటరీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.2,343 కోట్ల ఆదాయాన్ని, రూ.702 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.1,997 కోట్లు, నికరలాభం రూ.557 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆదాయాల్లో జనరిక్స్‌- క్రామ్స్‌ వాటా నిష్పత్తి 47 శాతం, 53 శాతంగా ఉన్నట్లు దివీస్‌ యాజమాన్యం మదుపరులతో నిర్వహించిన ‘కాన్ఫెరెన్స్‌ కాల్‌’ లో వెల్లడించింది. ఎంఎస్‌డీ (మెర్క్‌) తో ఒప్పందం ప్రకారం మోల్నుపిరవిర్‌ ఔషధ కాంట్రాక్టు పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఏపీఐ జనరిక్‌ ఔషధాలపై కొంతకాలంగా ఒత్తిడి కనిపిస్తుండగా, ప్రస్తుతం వ్యయాలు కూడా పెరిగి, ఆ మేరకు లాభాలపై ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది.


లిథియమ్‌, కోబాల్ట్‌ కోసం విదేశాల్లో ఎన్‌ఎండీసీ అన్వేషణ

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ లిథియమ్‌, కోబాల్ట్‌ తదితర ఖనిజాల కోసం విదేశాల్లో తవ్వకాలు చేట్టాలనే ఆలోచన చేస్తోంది. ఈ ఖనిజాలను విద్యుత్తు వాహనాల బ్యాటరీలు తయారు చేయడానికి వినియోగిస్తారు. దీంతో పాటు రాగి, నికెల్‌, బంగారం కోసం కూడా అన్వేషించనున్నట్లు ఎన్‌ఎండీసీ సీఎండీ సుమిత్‌ దేబ్‌ తెలిపారు. ఆస్ట్రేలియాలోని లెగసీ ఐరన్‌ ఓర్‌ లిమిటెడ్‌ ద్వారా వీటి కోసం తవ్వకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ‘భారతీయ లోహాల పరిశ్రమ- భవిష్యత్తు లక్ష్యాలు’ అంశంపై ఫిక్కీ నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. లెగసీ ఐరన్‌ ఓర్‌ లిమిటెడ్‌లో ఎన్‌ఎండీసీకి 90 శాతం వాటా ఉంది. ఆఫ్రికా ఖండంలోని టాంజానియా, జింబాబ్వే దేశాల్లో సైతం ఈ ఖనిజాల కోసం తవ్వకాలు చేపట్టాలని భావిస్తున్నట్లు సుమిత్‌ దేబ్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి ఇనుప ఖనిజానికి డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని