రూ.5,000 నుంచి రూ.46,000 కోట్లకు

రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా.. ఆయన పూర్వీకులు రాజస్థాన్‌లోని ఝున్‌ఝున్‌ ప్రాంతానికి చెందినవారు. రాకేశ్‌ తండ్రి రాధేశ్యామ్‌ ఆదాయపు పన్ను అధికారిగా చేసేప్పుడు హైదరాబాద్‌లో ఆయన జన్మించారు. తదుపరి ఆ కుటుంబం ముంబయికి వెళ్లింది.

Updated : 15 Aug 2022 07:46 IST

37 ఏళ్లలో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా వ్యాపార సామ్రాజ్య తీరిదీ

రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా.. ఆయన పూర్వీకులు రాజస్థాన్‌లోని ఝున్‌ఝున్‌ ప్రాంతానికి చెందినవారు. రాకేశ్‌ తండ్రి రాధేశ్యామ్‌ ఆదాయపు పన్ను అధికారిగా చేసేప్పుడు హైదరాబాద్‌లో ఆయన జన్మించారు. తదుపరి ఆ కుటుంబం ముంబయికి వెళ్లింది. సైడెన్‌హామ్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ చదివిన తర్వాత చార్టర్డ్‌ అకౌంటెన్సీని రాకేశ్‌ పూర్తి చేశారు. తండ్రి మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుండటాన్ని చూసిన రాకేశ్‌ కూడా స్టాక్‌ మార్కెట్‌పై ప్రేమ పెంచుకున్నారు. 1985లో తన 25 ఏళ్ల వయసులో సోదరుడు రాజేశ్‌ నుంచి తీసుకున్న అప్పుతో ఆయన మొదటిసారిగా స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడర్‌గా పెట్టుబడులు పెట్టారు. అప్పుడు బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ 150 పాయింట్ల వద్ద ఉండేది. ప్రస్తుతం సెనెక్స్‌ 59,463 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, రాకేశ్‌ వ్యాపార సామ్రాజ్య విలువ రూ.46,000 కోట్లకు చేరింది.

టాటా టీ షేరుతో తొలి లాభం

1986లో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మొదటి లాభాన్ని ఆర్జించారు. టాటా టీ షేరు రూ.43 వద్ద 5000 షేర్లు కొనుగోలు చేయగా, మూడు నెలల్లో అది రూ.143కు దూసుకెళ్లింది. తదుపరి మూడేళ్లలోనే రూ.20-25 లక్షల లాభాన్ని గడించారు. పెట్టుబడుల్లో ఎక్కువ రిస్క్‌ తీసుకునే వ్యక్తిగా ఆయనకు పేరుంది. గెలుపు గుర్రాలుగా భావించే సంస్థలను ఎంపిక చేసుకుని, ఆయా షేర్లు భారీమొత్తాల్లో కొనడంలో నేర్పరితనమే ఆయనకు అధిక లాభాలను తెచ్చిపెట్టింది. 1992లో ప్రైవేట్‌ ట్రేడింగ్‌ సంస్థ రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను స్థాపించారు. తన పేరు, భార్య రేఖ పేరులోని మొదటి రెండు అక్షరాలు తీసుకుని సంస్థకు ఈ పేరు పెట్టారు.

* హంగామా మీడియా, యాప్‌టెక్‌ ఛైర్మన్‌గా రాకేశ్‌ వ్యవహరిస్తున్నారు. వైస్రాయ్‌ హోటల్స్, కాంకర్డ్‌ బయోటెక్, ప్రోవోగ్‌ ఇండియా, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బోర్డుల్లో ఆయన సభ్యుడు.

* ఈనెల 7 నుంచి కార్యకలాపాలు ప్రారంభించిన విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లో 40 శాతం వాటా ఉంది.

రాకేశ్‌ కొనుగోలు చేసిన కంపెనీల షేర్ల ధరలు పెరగడం.. ఆయన విక్రయించారని వార్తలు వచ్చిన వెంటనే పడిపోవడమూ పరిపాటిగా మారింది. అందుకే చిన్న మదుపర్లకు రాకేశ్‌ అంటే బాగా గురి. ఆయన పోర్ట్‌ఫోలియో (కొనుగోలు చేసిన కంపెనీల షేర్లు)ను అనుసరించి, వాటిల్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య దేశంలో లక్షల్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు.

* మార్కెట్లు పతనమైనప్పుడు ఎక్కువ పెట్టుబడులు పెట్టి, రాణిస్తున్నప్పుడు లాభాలు స్వీకరించడం ఝున్‌ఝున్‌వాలా ప్రత్యేకత.

కుంభకోణాలకు దూరంగానే..

స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు అంటే నష్టపోతామని, మోసపూరితమని భావించేవారు ఇప్పటికీ ఉన్నారు. కంప్యూటర్, మొబైల్‌ ద్వారా లావాదేవీలు కళ్లముందు కనపడతున్నా ఇలా భావిస్తున్నారంటే.. 40 ఏళ్ల కిందట పరిస్థితి ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. ఆర్థిక సంస్కరణల తర్వాత హర్షద్‌ మెహతా, కేతన్‌ పరేఖ్‌ వంటి వారు స్టాక్‌మార్కెట్‌లో ఒక్కసారిగా దూసుకెళ్లినప్పటికీ.. ఆ తర్వాత వారి కుంభకోణాలు వెలుగు చూడటంతో, కనుమరుగయ్యారు. అప్పట్లో వెలుగుచూసిన కుంభకోణాల ఫలితంగా మార్కెట్లు పతనమై, చిన్న మదుపర్లు భారీగా నష్టపోయేవారు. ఆ పరిస్థితుల్లోనూ స్టాక్‌ మార్కెట్‌లోకి ప్రవేశించి, తెలివిగా పెట్టుబడులు పెడుతూ, రూ.46,000 కోట్ల సంపదను పోగుచేయడంతో, దేశంలో అతిపెద్ద మదుపరిగా రాకేశ్‌ గుర్తింపు సంపాదించారు. కుంభకోణాలకు పాల్పడకుండా, స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజ మదుపరిగా తనదైన గుర్తింపును రాకేశ్‌ ఆర్జించారు. కొన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసుల్లో మాత్రం ఆయన పేరు వచ్చింది. పెద్ద కార్యక్రమాలకు ముందు స్టాక్‌ ట్రేడ్‌లపై ఫ్రంట్‌ రన్‌ చేస్తారని అంటారు.

2021లో యాప్‌టెక్‌లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసులో ఆయన, ఇతరులు రూ.37 కోట్లు చెల్లించి సెటిల్‌మెంట్‌ చేసుకున్నారు.

2021లో సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌తో జీ ఎంటర్‌ప్రైజెస్‌ విలీనానికి ముందే, ఆయన ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టి రూ.70 కోట్ల లాభం ఆర్జించారు. ఇవి పలు సందేహాలను లేవనెత్తింది.

గతేడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కావడం అందరినీ ఆశ్యర్యపరచింది. అధికార ఎన్‌డీఏకు ఝున్‌ఝున్‌వాలా అనుకూలంగా ఉంటారనే పేరు ఉంది. తదుపరి ఆయన చేపట్టిన విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌కు అతి త్వరగా అనుమతులు లభించాయి.

ఇటీవల వచ్చిన ప్రముఖ వెబ్‌సిరీస్‌ ‘స్కామ్‌ 1992: ది హర్షద్‌ మెహతా స్టోరీ’లో ప్రారంభ రోజుల్లో రాకేశ్‌ కూడా మోసాలకు పాల్పడ్డారని ఉంది.

భోజన ప్రియుడు

సూట్‌లు ధరించి, ట్రేడింగ్‌ చేసుకునే ‘ట్రేడర్‌’ను కాదని రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా చెప్పేవారు. ఎప్పుడూ సాధారణ దుస్తుల్లోనే కనిపించేవారు. ముఖ్యమైన కార్యక్రమాలకూ సాధారణ షర్ట్, ఫ్యాంట్‌ వేసుకునేవారు. నోటిలో ఎక్కువగా గుట్కా లేదా పాన్‌తో ఉండేవారు. భోజనం, మిఠాయిలు, మద్యం అంటే ఆయనకు చాలా ఇష్టం. ధనార్జనలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానని కొన్ని సందర్భాల్లో చెప్పేవారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ, డయాలసిస్‌ చేయించుకుంటున్నారని సమాచారం.

ఫోర్బ్స్‌ కుబేరుల్లో

* ఫోర్బ్స్‌ ఇండియా 2021 సంవత్సరానికి సంబంధించి 100 మంది దేశీయ కుబేరుల జాబితాలో రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా 5.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.43,500 కోట్ల) సంపదతో 36వ స్థానంలో ఉన్నారు. ఆయన 62 పెట్టుబడుల విలువను పరిగణనలోకి తీసుకున్నట్లు ఫోర్బ్స్‌ తెలిపింది.

* 2022 సంవత్సరానికి ఫోర్బ్స్‌ రూపొందించిన ప్రపంచ కుబేరుల జాబితాలో రాకేశ్‌ సంపద విలువ మరికొంత పెరిగింది. ఈ ఏడాది 5.8 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.46,000 కోట్ల) సంపదతో ప్రపంచ కుబేరుల్లో 438వ స్థానంలో, దేశీయంగా చూస్తే 22వ స్థానంలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని