దీర్ఘకాల మూలధన లాభాల పన్ను విధానంలో మార్పులు

దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను విధానాన్ని హేతుబద్దీకరించే యోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్లు ఓ అధికారి శుక్రవారం వెల్లడించారు.

Published : 26 Nov 2022 03:10 IST

వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం

దిల్లీ: దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను విధానాన్ని హేతుబద్దీకరించే యోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్లు ఓ అధికారి శుక్రవారం వెల్లడించారు. ఒకే తరహా అసెట్‌ విభాగాల మధ్య సమానత్వాన్ని తీసుకు రానుందని, ఆధార సంవత్సరాన్ని (బేస్‌ ఇయర్‌) కూడా సవరించాలని అనుకుంటోందని తెలిపారు.
ప్రస్తుతం.. ఏడాది కాలావధికి మించి కలిగి ఉన్న షేర్లపై, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను 10 శాతంగా ఉంది. స్థిరాస్తి విక్రయం ద్వారా వచ్చిన లాభాలకు, రెండేళ్లకు మించి కలిగి ఉన్న నమోదు కాని షేర్లకు, మూడేళ్లకు మించి కలిగి ఉన్న బాండ్లు, ఆభరణాలకు 20 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను విధిస్తున్నారు.
ఈ పన్ను రేట్లలో మార్పులు చేయాలని రెవెన్యూ విభాగం భావిస్తోంది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును లెక్కించే కాలాన్ని కూడా (హోల్డింగ్‌ పీరియడ్‌) సవరించాలని అనుకుంటోంది. ఈ మార్పులను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ద్రవ్యోల్బణ సర్దుబాటు మూలధన లాభాలను లెక్కించేందుకు ఆధార సంవత్సరాన్ని కూడా సవరించే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. మూలధన లాభాల పన్ను లెక్కించేందుకు సూచీ సంవత్సరాన్ని (ఇండెక్స్‌ ఇయర్‌)ను ఎప్పటికప్పుడు సవరిస్తుంటారు. చివరిసారి 2007లో బేస్‌ ఇయర్‌ను 2001గా మార్పు చేశారు. దీర్ఘకాల మూలధన లాభాల పన్ను విధానాన్ని మరింత సులభతరంగా చేసే ఉద్దేశంతోనే ఈ మార్పులను ప్రభుత్వం చేపట్టనుందని ఆ అధికారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని