టయోటా కిర్లోస్కర్‌ వైస్‌ ఛైర్మన్‌ విక్రమ్‌ ఎస్‌ కిర్లోస్కర్‌ కన్నుమూత

భారత వాహన రంగ దిగ్గజం, టోయోటో కిర్లోస్కర్‌ వైస్‌ ఛైర్మన్‌ విక్రమ్‌ ఎస్‌.కిర్లోస్కర్‌ (64) మంగళవారం రాత్రి మృతి చెందారు.

Published : 01 Dec 2022 01:36 IST

ఈనాడు, బెంగళూరు : భారత వాహన రంగ దిగ్గజం, టోయోటో కిర్లోస్కర్‌ వైస్‌ ఛైర్మన్‌ విక్రమ్‌ ఎస్‌.కిర్లోస్కర్‌ (64) మంగళవారం రాత్రి మృతి చెందారు. బెంగళూరులో ఉంటున్న ఆయనకు మంగళవారం ఉదయం గుండెపోటు రావటంతో స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స ఫలించక అదేరోజు రాత్రి మృతి చెందినట్లు టొయోటో కిర్లోస్కర్‌ సంస్థ బుధవారం ప్రకటించింది. ఆయన అంతిమ సంస్కారాలను బుధవారం హెబ్బాళలోని చితాగారంలో నిర్వహించారు. కిర్లోస్కర్‌కు భార్య గీతాంజలి కిర్లోస్కర్‌, కుమార్తె మానసి కిర్లోస్కర్‌ ఉన్నారు. విక్రమ్‌ కిర్లోస్కర్‌ మృతికి  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, పరిశ్రమ ప్రముఖులు ఉదయ్‌ కోటక్‌, కిరణ్‌ మజుందార్‌ షా తదితరులు సంతాపం తెలిపారు.

పైపులు, ఇంజిన్లు, కంప్రెసర్‌ అనుబంధ ఉత్పత్తులను తయారు చేసే కిర్లోస్కర్‌ సంస్థను కార్ల తయారీ దిగ్గజ సంస్థగా మార్చడంలో విక్రమ్‌ కిర్లోస్కర్‌ కీలకంగా వ్యవహరించారు. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన విక్రమ్‌ కిర్లోస్కర్‌.. తండ్రి శ్రీకాంత్‌ కిర్లోస్కర్‌ నుంచి వ్యాపార బాధ్యతలు స్వీకరించి కిర్లోస్కర్‌ సామ్రాజ్యాన్ని విస్తరించారు. జపాన్‌కు చెందిన టయోటాను భారత్‌కు రప్పించి, టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ పేరిట సంయుక్త సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా దేశ వాహన రంగంపై తనదైన ముద్ర వేశారు. వాహన తయారీసంస్థల సమాఖ్య సియామ్‌కు ప్రెసిడెంట్‌ (2013-2015); భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)కు ప్రెసిడెంట్‌(2019-20)గా బాధ్యతలు నిర్వర్తించారు. విక్రమ్‌ మృతి వాహన పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసిందని సియామ్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. తనకు వ్యక్తిగతంగా, పరిశ్రమకు ఆయన లేని లోటు తీరనిదని సీఐఐ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ బజాజ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని