భారతీయతనే ప్రతిబింబిస్తా

ఎక్కడ అయినా భారతీయతనే ప్రతిబింబిస్తానని గూగుల్‌, ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు.

Published : 04 Dec 2022 02:40 IST

వాషింగ్టన్‌: ఎక్కడ అయినా భారతీయతనే ప్రతిబింబిస్తానని గూగుల్‌, ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం 2022 ఏడాదికి ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పురస్కారం పద్మభూషణ్‌ని అమెరికాలో భారత రాయబారి తరణ్‌జీత్‌సింగ్‌ సంధూ చేతులమీదుగా సుందర్‌ పిచాయ్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మూడో అత్యున్నత  పురస్కారాన్ని అందించిన భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు. నన్ను తీర్చిదిద్దిన దేశం నుంచి ఈ గౌరవం పొందడాన్ని అత్యంత అర్థవంతమైన విషయంగా భావిస్తున్నా’ అని వెల్లడించారు. ‘ప్రధాని మోదీ పథకమైన డిజిటల్‌ ఇండియా వృద్ధిని ప్రేరేపిస్తుంది. భారత్‌లో గూగుల్‌ పెట్టుబడులు కొనసాగించడాన్ని, ప్రభుత్వం, వ్యాపార సంస్థలు, ప్రజలతో భాగస్వామ్యం కావడాన్ని గర్వంగా భావిస్తున్నా. మన గడప వరకు చేరే ప్రతి సాంకేతికతా మన జీవితాలను మెరుగుపరుస్తుంది. ఆ అనుభవమే నన్ను గూగుల్‌ మార్గంలోకి తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు సహకరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించే అవకాశం ఇచ్చింది’ అని పేర్కొన్నారు. జీ-20 నాయకత్వ బాధ్యతలను భారత్‌ చేపట్టడంపై స్పందిస్తూ.. ఇంటర్నెట్‌ను సురక్షితంగా, అందరూ వినియోగించేలా చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయొచ్చని పేర్కొన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత కాన్సుల్‌ జనరల్‌ టి.వి.నాగేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని