అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓకు పూర్తి స్పందన

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)కు పూర్తి స్పందన లభించింది.

Published : 01 Feb 2023 04:22 IST

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)కు పూర్తి స్పందన లభించింది. ఇష్యూలో 4.55 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా, 5.08 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. సంస్థాగతేతర మదుపర్లు తమకు కేటాయించిన మొత్తానికి, మూడు రెట్లకు పైగా ఆసక్తి చూపగా, క్యూఐబీ విభాగంలో 1.2 రెట్ల స్పందన దక్కింది. రిటైల్‌ మదుపర్లు నుంచి 12 శాతం, కంపెనీ ఉద్యోగుల నుంచి 55 శాతం స్పందనే వచ్చింది. పలువురు సహచర పారిశ్రామికవేత్తల సహాయంతో ఎఫ్‌పీఓను అదానీ  గట్టెక్కించారని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

* ఇజ్రాయెల్‌ పోర్ట్‌ ఆఫ్‌ హైఫాను 1.2 బిలియన్‌ డాలర్లకు అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసింది. టెల్‌ అవివ్‌లో కృత్రిమ మేధ ల్యాబ్‌ సహా పలు పెట్టుబడులను ప్రకటించింది. మంగళవారం జరిగిన ఒప్పంద కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని   నెతన్యాహు, గౌతమ్‌ అదానీ పాల్గొన్నారు.

* మంగళవారం కూడా అదానీ గ్రూప్‌ షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. అదానీ టోటల్‌ గ్యాస్‌ 10%, అదానీ పవర్‌ 4.99%, అదానీ విల్మర్‌ 5% పడ్డాయి. అదానీ గ్రీన్‌ 3.06%, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 3.73%, అదానీ పోర్ట్స్‌ 2.67%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 3.35%, అంబుజా 3.50%, ఏసీసీ 3.39%, ఎన్‌డీటీవీ 1.35% చొప్పున రాణించాయి. గత నాలుగు ట్రేడింగ్‌ రోజుల్లో అదానీ గ్రూప్‌ షేర్ల మార్కెట్‌ విలువ రూ.5.5 లక్షల కోట్లు తగ్గింది.

సర్క్యూట్‌ లిమిట్‌లో మార్పు: మదుపర్ల సంపదను కాపాడేందుకు అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ టోటల్‌ గ్యాస్‌ షేర్ల సర్క్యూట్‌ లిమిట్‌ను 20% నుంచి 10 శాతానికి సవరించినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు తెలిపాయి.


ప్రపంచ అగ్రగామి 10 మంది కుబేరుల జాబితా నుంచి అదానీ వెలుపలకు

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ పరిశోధనా నివేదిక అనంతరం అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల విలువలు పతనం కావడంతో, గౌతమ్‌ అదానీ సంపద విలువ కూడా భారీగా పతనమైంది. ఫలితంగా బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్ల జాబితాలోని తొలి 10 మందిలో చోటు కోల్పోయారు. జనవరి 26 వరకు మూడో స్థానంలో ఉన్న అదానీ, ఈనెల 30వ తేదీకి 11వ స్థానానికి దిగి వచ్చారు. ఆయన సంపద విలువ 84.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ 82.2 బిలియన్‌ డాలర్లతో 12వ స్థానంలో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని