సిమెంటులోకి రూ.1.20 లక్షల కోట్లు!

దేశంలోని సిమెంటు కంపెనీలు తమ తయారీ సామర్థ్యాన్ని భారీగా విస్తరిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో మౌలిక సదుపాయాల రంగం నుంచి ముఖ్యంగా గృహ నిర్మాణ విభాగం నుంచి అధిక గిరాకీ ఉంటుందనే అంచనాలే దీనికి ప్రధాన కారణం.

Published : 18 Mar 2023 01:29 IST

2027 నాటికి 725 మిలియన్‌ టన్నులకు ఉత్పత్తి సామర్థ్యం
మౌలిక, గృహ నిర్మాణ రంగాల నుంచి గిరాకీ వల్లే

ఈనాడు - హైదరాబాద్‌

దేశంలోని సిమెంటు కంపెనీలు తమ తయారీ సామర్థ్యాన్ని భారీగా విస్తరిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో మౌలిక సదుపాయాల రంగం నుంచి ముఖ్యంగా గృహ నిర్మాణ విభాగం నుంచి అధిక గిరాకీ ఉంటుందనే అంచనాలే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం దేశీయ కంపెనీల సిమెంటు ఉత్పత్తి వార్షిక సామర్థ్యం 570 మి.టన్నులుగా ఉంది. కంపెనీలు కొత్తగా పెడుతున్న రూ.1.20 లక్షల కోట్ల  పెట్టుబడులతో 2027 నాటికి దేశంలో సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం మరో 155 మిలియన్‌ టన్నులు పెరిగి 725 మి.టన్నులకు చేరుతుందని క్రెడిట్‌ రేటింగ్‌, కన్సల్టెన్సీ సేవల సంస్థ ‘క్రిసిల్‌’ తాజా నివేదికలో పేర్కొంది.

పెరుగుతున్న వినియోగం

మనదేశంలో ఉత్పత్తి అయ్యే సిమెంటులో 60- 65 శాతాన్ని గృహ నిర్మాణ రంగమే వినియోగిస్తోంది. కొవిడ్‌ పరిణామాల్లో గత రెండేళ్లుగా నిర్మాణ కార్యకలాపాలు నెమ్మదించాయి. రోడ్లు, వంతెనలు, వాణిజ్య ప్రాంగణాల నిర్మాణమూ పెద్దగా సాగలేదు. సాధారణ పరిస్థితులు నెలకొన్నందున, ప్రస్తుతం నిర్మాణ కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. దీంతో సిమెంటు వినియోగం బాగా పెరిగింది. వచ్చే నాలుగైదేళ్ల పాటు ఏటా సిమెంటు వినియోగం 6-7% చొప్పున పెరుగుతుందన్నది అంచనా. దీనికి అనుగుణంగా అధికోత్పత్తికి కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. కొత్త యూనిట్లు, అదనపు సామర్థ్యం ప్రధానంగా మధ్య భారతదేశంతో పాటు తూర్పు- ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి రావచ్చని అంచనా. ఈ ప్రాంతాల్లోని గ్రామాల్లో గృహ నిర్మాణాలు అధికంగా జరుగుతున్నాయి. దక్షిణాదితో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సిమెంటు ఉత్పత్తి సామర్యం 19% పెరిగే అవకాశాలున్నాయి.

అల్ట్రాటెక్‌ ముందంజ  

అగ్రశ్రేణి సిమెంటు కంపెనీ అయిన అల్ట్రాటెక్‌ 2018 నుంచి తన ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది.  కొత్తగా సిమెంటు యూనిట్లు నిర్మించడమే కాకుండా, చిన్న- మధ్యస్థాయి సిమెంటు కంపెనీలను కొనుగోలు చేస్తోంది. ప్రస్తుత యూనిట్లను విస్తరిస్తోంది కూడా. గత నెలలోనే ఈ సంస్థ ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల్లో 2 యూనిట్లు ప్రారంభించింది. ఛత్తీస్‌గఢ్‌ యూనిట్‌కు అదనంగా 1.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యాన్ని జోడించింది. ఒడిశాలో 2.8 మిలియన్‌ టన్నుల కొత్త యూనిట్ నిర్మించింది. దీంతో అల్ట్రాటెక్‌ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 127 మిలియన్‌ టన్నులకు చేరింది. దీని తర్వాత రెండో స్థానంలో ఉన్న అదానీ గ్రూపు (అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ)నకు 70 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది.

దక్షిణాదిలో

దాల్మియా భారత్‌, కొన్ని ఇతర సిమెంటు కంపెనీలు సామర్థ్యాన్ని పెంచుకుంటున్నప్పటికీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవల సాగర్‌ సిమెంట్స్‌ విస్తరిస్తున్న తీరు ఆసక్తికరంగా ఉంది. ఈ సంస్థ, ఖాయిలా పడిన సిమెంటు కంపెనీలను కొనుగోలు చేస్తూ (ఇన్‌-ఆర్గానిక్‌ పద్ధతిలో) తన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. 2025 నాటికి 10 మిలియన్‌ టన్నుల సామర్థ్యాన్ని సాధించాలనేది ఈ సంస్థ లక్ష్యం కాగా, ఇప్పటికే అధిగమించింది. మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన రెండు యూనిట్లు ఇటీవల ఉత్పత్తి దశలోకి అడుగుపెట్టాయి. పాణ్యం సిమెంట్స్‌, ఆంధ్రా సిమెంట్స్‌నూ సాగర్‌ సిమెంట్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్రల్లో అమ్మకాలు పెంచుకునే అవకాశం ఈ సంస్థకు లభిస్తోంది. ఇక్కడి ఇతర సిమెంటు కంపెనీలు కూడా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని