అదానీ పోర్ట్స్‌కు ‘బీబీబీ-’ రేటింగ్‌: ఫిచ్‌

అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీఎస్‌ఈజెడ్‌)కు స్థిరత్వంతో కూడిన అంచనాతో ‘బీబీబీ-’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది.

Published : 24 Mar 2023 01:33 IST

దిల్లీ: అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీఎస్‌ఈజెడ్‌)కు స్థిరత్వంతో కూడిన అంచనాతో ‘బీబీబీ-’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది. ఈ సంస్థ రుణాల వ్యయాలపై హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రభావం స్వల్పకాలానికే పరిమితం అవుతుందని పేర్కొంది. అదానీ గ్రూప్‌ తమ కంపెనీల షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లో మోసాలు చేస్తోందని ఆరోపిస్తూ హిండెన్‌బర్గ్‌ ఈ ఏడాది జనవరి 24న ఓ నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను అదానీ గ్రూపు కొట్టిపారేసింది. తాము నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుంటున్నామని స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడినప్పటి నుంచి అదానీ గ్రూపు షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ నేపథ్యంలో అదానీ పోర్ట్స్‌పై తాజాగా స్థిరమైన అంచనాతో బీబీబీ- రేటింగ్‌ను ఫిచ్‌ రేటింగ్స్‌ కొనసాగించడం గమనార్హం. సంస్థకు ఉన్న ఓడరేవులు, అత్యున్నత స్థాయి నిర్వహణ సామర్థ్యం, తగినంత ద్రవ్యలభ్యత లాంటి వాటి వల్ల రుణాల చెల్లింపులపై ఎలాంటి ప్రభావం పడకపోవచ్చని ఫిచ్‌ రేటింగ్‌ తెలిపింది. సమీప కార్యకలాపాల నిర్వహణకు, మూలధన వ్యయాలకు, రుణాల చెల్లింపునకు అదానీ పోర్ట్స్‌ వద్ద అంతర్గతంగా ఉన్న మిగులు నిధులు సరిపోతాయని పేర్కొంది. ప్రాజెక్టుల విస్తరణకు కూడా ఎలాంటి అవరోధాలు ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు వివరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని