అమరరాజా ఈవీ బ్యాటరీకి ఏఆర్‌ఏఐ ధ్రువీకరణ

అమరరాజా బ్యాటరీస్‌ రూపొందించిన ఈవీ (ఎలక్ట్రిక్‌ వెహికల్‌) బ్యాటరీకి ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఏఆర్‌ఏఐ) నుంచి భద్రత ధ్రువీకరణ లభించింది.

Published : 29 Mar 2023 03:20 IST

ఈనాడు, హైదరాబాద్‌: అమరరాజా బ్యాటరీస్‌ రూపొందించిన ఈవీ (ఎలక్ట్రిక్‌ వెహికల్‌) బ్యాటరీకి ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఏఆర్‌ఏఐ) నుంచి భద్రత ధ్రువీకరణ లభించింది. రెండో దశ- ఏఐఎస్‌-156 అమెండ్‌మెంట్‌ 3 నిబంధన కింద దీనికి అనుమతి లభించినట్లు అమరరాజా బ్యాటరీస్‌ వెల్లడించింది. రెండో దశ- ఏఐఎస్‌-156 అమెండ్‌మెంట్‌ 3 నిబంధనలు ఈ నెల 31వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈవీ బ్యాటరీలు కొన్ని చోట్ల మంటల్లో చిక్కుకుపోవటం, పేలటం... వంటి ఉదంతాలు చోటుచేసుకోవటంతో రెండవ దశ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. దీనివల్ల ఈవీ బ్యాటరీలు భద్రంగా ఉంటాయని భావిస్తున్నారు. మూడు చక్రాల వాహనాల కోసం అమరరాజా బ్యాటరీస్‌ రూపొందించిన 7.5 కిలోవాట్‌ నుంచి 8.5 కిలోవాట్‌ సామర్థ్యం కల లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీ ప్యాక్‌లకు ఈ కొత్త నిబంధనల కింద ఏఆర్‌ఏఐ అనుమతి ఇచ్చింది. ఈవీ బ్యాటరీల విభాగంలో ఇది ఎంతో కీలకమైన పరిణామమని అమరరాజా బ్యాటరీస్‌ అధ్యక్షుడు (నూతన ఇంధనాల వ్యాపారం) విజయానంద్‌ సముద్రాల తెలిపారు.  ఈవీ బ్యాటరీలు, సంబంధిత ఇతర ఉత్పత్తుల కోసం అమరరాజా బ్యాటరీస్‌  వచ్చే పదేళ్లలో రూ.9,500 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్న విషయం విదితమే. తద్వారా ఈవీ బ్యాటరీల విభాగంలో క్రియాశీలకమైన పాత్ర పోషించడానికి ఈ సంస్థ సిద్ధం అవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని