సంక్షిప్త వార్తలు(7)

తూర్పు తీరంలోని కరైకల్‌ పోర్టు స్వాధీనత పూర్తయినట్లు అదానీ గ్రూప్‌ సంస్థ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఏపీఎస్‌ఈజడ్‌) శనివారం తెలిపింది.

Updated : 02 Apr 2023 01:46 IST

కరైకల్‌ పోర్టు స్వాధీనం పూర్తి: అదానీ పోర్ట్స్‌

ముంబయి: తూర్పు తీరంలోని కరైకల్‌ పోర్టు స్వాధీనత పూర్తయినట్లు అదానీ గ్రూప్‌ సంస్థ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఏపీఎస్‌ఈజడ్‌) శనివారం తెలిపింది. ఈ పోర్టు కోసం అదానీ గ్రూప్‌ సమర్పించిన పరిష్కార ప్రణాళికను జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అంగీకరించడమే ఇందుకు కారణం. ఈ ప్రణాళిక ప్రకారం.. పోర్టు రుణ దాతలకు అదానీ గ్రూప్‌ రూ.1485 కోట్లు చెల్లిస్తుంది. ఆ నౌకాశ్రయంలో సదుపాయాల ఆధునికీకరణ, మౌలిక వసతుల అభివృద్ధికి మరో రూ.850 కోట్లు వెచ్చిస్తామనీ అదానీ పోర్ట్స్‌ సీఈఓ కరణ్‌ అదానీ తెలిపారు. రాబోయే అయిదేళ్లలో పోర్టు సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలన్నది తమ ప్రణాళికగా వెల్లడించారు. కంటైనర్‌ టెర్మినల్‌ను కూడా జతచేయడం ద్వారా, బహుళ వినియోగ పోర్టుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అన్ని కాలాల్లో వినియోగించుకునేందుకు అనువైన లోతైన నౌకాశ్రయంగా దీనిని సంస్థ అభివర్ణించింది. 2009లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ పోర్టు చెన్నైకు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది.

* ప్రస్తుతం దేశంలోని 14 నౌకాశ్రయాలు అదానీ పోర్ట్స్‌ ఆధీనంలో ఉన్నాయి.


ల్యూమినస్‌ నుంచి కొత్త ఇన్వర్టర్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఇళ్లు, కార్యాలయాల్లో పవర్‌ బ్యాకప్‌ కోసం ఉపయోగించేందుకు రెండు కొత్త స్మార్ట్‌ ఇన్వర్టర్లను విడుదల చేసినట్లు ల్యూమినస్‌ వెల్లడించింది. ఇన్వర్టర్‌, బ్యాటరీని ఒకేచోట బిగించడంతో పాటు, గదిలో ఎక్కడైనా సురక్షితంగా పెట్టేందుకు వీలుగా ఐకాన్‌ను విడుదల చేసినట్లు సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ గంజు తెలిపారు. 3 పడక గదుల ఇల్లు, చిన్న షోరూం అవసరాలకు సరిపోయే వీటి ధరలు రూ.9- 14వేలుగా తెలిపారు. ఏసీలు ఇతర గృహోపకరణాలూ పనిచేసే అధిక సామర్థ్యం ఇన్వర్టర్‌ ధర రూ.12-85 వేల వరకూ ఉందన్నారు.


పీఎం సహాయ నిధికి ఓఎన్‌జీసీ రూ.100 కోట్ల విరాళం

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ పీఎం సహాయ నిధికి మరోసారి విరాళం అందించింది. ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తన వంతు సాయంగా శుక్రవారం రూ. 100 కోట్ల విరాళాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని భారత్‌ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి తన ట్విటర్‌ ద్వారా తెలిపారు. ‘ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు ఈ ఫండ్‌ సహాయపడుతుంది’’ అని ఓఎన్‌జీసీ పేర్కొంది. కొవిడ్‌ మహమ్మారి, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌తో  పోరాడేందుకు అవసరమైన ఔషధాల తయారీకి సహాయ పడుతుందని వెల్లడించింది.  

దేశంలో కరోనా వైరస్‌ విజృంబించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎం సహాయనిధి పేరుతో అత్యవసర సహాయ నిధిని ఏర్పాటు చేసింది. దీంతో పీఎం నిధికి పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి. 2020 ఏప్రిల్‌ కరోనా తొలిదశ వ్యాప్తి సమయంలో  ఓఎన్‌జీసీ రూ.300 కోట్ల సహాయాన్ని అందించగా.. వైద్య పరికారాలకోసం 2021-22 లో మరోసారి రూ.70 కోట్ల విరాళం అందించింది.


రూపాయల్లోనూ భారత్‌, మలేషియా వాణిజ్యం

దిల్లీ: భారత్‌, మలేషియా ద్వైపాక్షిక వాణిజ్యంలో లావాదేవీల సెటిల్‌మెంట్‌ కోసం భారత రూపాయినీ వినియోగించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎమ్‌ఈఏ) పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్య సెటిల్‌మెంట్‌కు భారత కరెన్సీకి అనుమతినిస్తూ గతేడాది జులైలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాణిజ్య వృద్ధికి ఊతం ఇవ్వడంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య ప్రయోజనాలకు మద్దతు ఇచ్చేందు కోసం ఆర్‌బీఐ చర్యలు చేపడుతోందని ఈ సందర్భంగా ఎమ్‌ఈఏ పేర్కొంది. ‘దేశీయ కరెన్సీలో చెల్లింపులు చేయడానికి ఉపయోగించే ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతాలను ప్రారంభించడం ద్వారా కౌలాలంపూర్‌లోని ఇండియా ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మలేషియా(ఐఐబీఎమ్‌) ఈ వ్యవస్థను ప్రారంభించిన’ట్లు ఒక ప్రకటనలో వివరించింది. దేశీయంగా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి ఈ ఖాతాను ప్రారంభించింది.


బీడీఎల్‌ సీఎండీగా రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు

ఈనాడు, హైదరాబాద్‌: రక్షణ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)కు ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా పి.రాధాకృష్ణ అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన బీడీఎల్‌కు డైరెక్టర్‌ (ప్రొడక్షన్‌)గా ఉన్నారు. బీడీఎల్‌ సీఎండీ సిద్ధార్థ్‌ మిశ్రా పదవీ విరమణ చేయడంతో రాధాకృష్ణ ఆ బాధ్యతలు తీసుకున్నారు. క్షిపణి ఉత్పత్తితో పాటు, ఇతర విభాగాల్లో దాదాపు 35 ఏళ్ల అనుభవం రాధాకృష్ణకు ఉంది. ఆయన నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌, జేఎన్‌టీయూ నుంచి ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ చేశారు.


ఎన్‌సీసీకి రూ.1,919 కోట్ల ఆర్డర్లు

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణ రంగ సంస్థ ఎన్‌సీసీ లిమిటెడ్‌ మార్చిలో రూ.1,919 కోట్ల ఆర్డర్లను సాధించింది. ఇందులో రవాణా విభాగానికి సంబంధించిన రెండు ఆర్డర్ల విలువ రూ.952 కోట్లు, విద్యుత్‌ విభాగానికి సంబంధించి రూ.792 కోట్లు, భవన నిర్మాణ విభాగం నుంచి రూ.175 కోట్ల మేరకు ఆర్డర్లు ఉన్నాయని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఎన్‌సీసీ వెల్లడించింది. ఇవన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చినట్లు తెలిపింది. 18-36 నెలల్లో వీటిని పూర్తి చేయాల్సి ఉందని పేర్కొంది.


అపిటోరియా ఫార్మాకు యాంటీబయాటిక్‌ యూనిట్‌: అరబిందో ఫార్మా

ఈనాడు, హైదరాబాద్‌: యాంటీబయాటిక్‌ యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రేడియంట్స్‌ (ఏపీఐ) విభాగాన్ని తన అనుబంధ సంస్థ అపిటోరియా ఫార్మాకు బదిలీ చేస్తున్నట్లు అరబిందో ఫార్మా తెలిపింది. వ్యాపార బదిలీ ఒప్పందంలో భాగంగా రూ.503 కోట్లకు ఈ విక్రయాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి లేదా రెండో త్రైమాసికం నాటికి ఈ లావాదేవీ పూర్తవుతుందని ఎక్స్ఛేంజీలకు సంస్థ సమాచారం ఇచ్చింది. అరబిందో ఏపీఐ విభాగంలో తెలంగాణలో యూనిట్‌ 5, ఆంధ్రప్రదేశ్‌లో యూనిట్‌ 17 ఉన్నాయి. బదిలీ చేస్తున్న డివిజన్‌ నికర విలువ డిసెంబరు 31 నాటికి రూ.467 కోట్లుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని