Go First Airline: ఊపిరి పీల్చుకున్న గో ఫస్ట్‌

Go First Airline: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని సతమతమవుతున్న గో ఫస్ట్‌ విమానయాన సంస్థకు భారీ ఊరట లభించింది. వారం రోజుల అనిశ్చితికి తెరదించుతూ, సంస్థపై దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించేందుకు జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతినిచ్చింది.

Updated : 11 May 2023 08:59 IST

దివాలా పరిష్కార ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ అనుమతి
సంస్థ చెల్లింపులపై మారటోరియం ఆంక్షల విధింపు
దివాలా పరిష్కార వృత్తి నిపుణుడిగా అభిలాష్‌ లాల్‌

దిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని సతమతమవుతున్న గో ఫస్ట్‌ విమానయాన సంస్థకు భారీ ఊరట లభించింది. వారం రోజుల అనిశ్చితికి తెరదించుతూ, సంస్థపై దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించేందుకు జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతినిచ్చింది. గోఫస్ట్‌ కోరిన విధంగా, ఆర్థికపరమైన వ్యవహారాలపై మారటోరియం ఆంక్షలు విధించింది. దీంతో గో ఫస్ట్‌ నుంచి లీజుదార్లు విమానాలను వెనక్కి తీసుకోవడానికి ప్రస్తుతానికైతే వీలుండదు. 7,000 మందికి పైగా ఉద్యోగులున్న గో ఫస్ట్‌ చేసుకున్న స్వచ్ఛంద దివాలా ప్రక్రియకు అనుమతినివ్వడం అటు కంపెనీకే కాకుండా.. ఉద్యోగులకూ ఉపశమనం కలిగించే పరిణామంగా చెబుతున్నారు. విమానాలను లీజుకిచ్చిన సంస్థలు, 45 విమానాల డీరిజిస్ట్రేషన్‌కు అభ్యర్థించిన మరుసటిరోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఇదీ నేపథ్యం

గో ఫస్ట్‌ దివాలా పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ విచారణకు స్వీకరిస్తూ ‘ఐబీసీ చట్టంలో నిర్దేశించిన పరిమితికి మించి రుణాల చెల్లింపుల్లో వైఫల్యం, ఎగవేతలకు గో ఫస్ట్‌ పాల్పడినట్లు కనిపిస్తోంది. రుణ సంస్థలు జారీ చేసిన డిమాండు నోటీసులను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. అయితే విమాన అద్దె సంస్థలు ఈ నోటీసులను కనీసం సవాలు కూడా చేయలేదు. అందువల్ల దివాలా స్మృతి (ఐబీసీ)లోని సెక్షన్‌ 10 కింద పిటిషన్‌ను స్వీకరించడం మినహా మరో మార్గం లేదు. ఆ ప్రకారంగానే గోఫస్ట్‌ దివాలా పరిష్కార ప్రక్రియకు అనుమతినిస్తున్నామ’ని జస్టిస్‌ రామలింగం సుధాకర్‌ నేతృత్వంలోని ఎన్‌సీఎల్‌టీ ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. రూ.11,463 కోట్లకు పైగా బకాయిలున్న గోఫస్ట్‌, ఐబీసీలోని సెక్షన్‌ 10 కింద స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు సమర్పించిన సంగతి తెలిసిందే.

విచారణ అనంతరం ఎన్‌సీఎల్‌టీ నిర్ణయాలివీ

* మధ్యంతర దివాలా పరిష్కార వృత్తి నిపుణుడిగా (ఐఆర్‌పీ) గోఫస్ట్‌ సూచించిన అభిలాశ్‌ లాల్‌నే  నియమించి, తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది.

* గో ఫస్ట్‌ బోర్డును ఎన్‌సీఎల్‌టీ రద్దు చేసినందున, ఇకపై కంపెనీ కార్యకలాపాలను ఐఆర్‌పీనే చూసుకుంటారు. దివాలా పరిష్కార తీర్పు అమలు కోసం అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా.. ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా చూస్తారు.

* ఉద్యోగులెవరినీ తొలగించకూడదని ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలిచ్చింది. ఒకవేళ అలాంటి పరిణామాలు సంభవించినా, నిర్ణయాలు తీసుకున్నా.. ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకు రావాలని సూచించింది.

మారటోరియం వల్ల

మారటోరియం ఆంక్షలు విధించడం ద్వారా కోర్టు కేసుల నుంచి గో ఫస్ట్‌కు రక్షణ కల్పించింది. దీంతో దివాలా పరిష్కార ప్రక్రియ పూర్తయ్యే వరకు సంస్థపై ఇప్పటికే కొనసాగుతున్న, పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు అమలు చేయడానికి వీలుండదు. గో ఫస్ట్‌ ఎటువంటి ఆస్తుల విక్రయం, బదిలీ చేపట్టకూడదు. ఆ ఆస్తులపై తీసుకున్న సెక్యూరిటీలను ఫోర్‌క్లోజ్‌, రికవర్‌ చేయడానికీ వీల్లేదు.

* ఐఆర్‌పీ తక్షణ వ్యయ అవసరాల కోసం రద్దయిన యాజమాన్యం రూ.5 కోట్లను డిపాజిట్‌ చేయాలి. ఈ డబ్బులను షరతులకు లోబడి ఐఆర్‌పీ ఖాతా కింద రుణ సంస్థలు సర్దుబాటు చేసి.. తిరిగి పొందొచ్చు.

లీజుదార్ల పిటిషన్ల తిరస్కారం

విమాన అద్దె సంస్థలైన ఎస్‌ఎమ్‌బీసీ ఏవియేషన్‌ కేపిటల్‌, నర్మదా ఏవియేషన్‌ లీజింగ్‌, యమునా ఏవియేషన్‌ లీజింగ్‌, జీఏఎల్‌ ఎంఎస్‌ఎన్‌, జీవై ఏవియేషన్‌ లీజ్‌.. గో ఫస్ట్‌ దివాలా పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఐబీసీలోని సెక్షన్‌ 65 కింద దరఖాస్తు సమర్పిస్తామని కోరాయి. ఈ పిటిషన్లను ట్రైబ్యునల్‌ తిరస్కరించింది. గో ఫస్ట్‌ పిటిషన్‌పై ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవాలంటే.. రుణ సంస్థలకు నోటీసులు ఇవ్వాలి. తద్వారా పిటిషన్‌పై అభ్యంతరాన్ని వెలిబుచ్చే అవకాశాన్ని వాటికి కల్పించాలని ఎన్‌సీఎల్‌టీ తెలిపింది.

* ఐబీసీ ఉద్దేశాలకు అనుగుణంగా ఆస్తుల విలువను పరిరక్షించేందుకు, ఉద్యోగులు, ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు సత్వరం నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉన్నందున.. సెక్షన్‌ 65 దరఖాస్తు సమర్పణ వరకు వేచిచూడడం సబుబు కాదని ఎన్‌సీఎల్‌టీ భావించింది. సెక్షన్‌ 10 కింద దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించేందుకే మొగ్గు చూపుతున్నట్లు ధర్మాసనం తెలిపింది.

అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు ఎస్‌ఎమ్‌బీసీ ఏవియేషన్‌ కేపిటల్‌

ఎన్‌సీఎల్‌టీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జాతీయ కంపెనీల చట్టం అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)ను విమాన అద్దె సంస్థ ఎస్‌ఎమ్‌బీసీ ఏవియేషన్‌ కేపిటల్‌ ఆశ్రయించింది. గతంలో ఆర్‌బీఎస్‌ ఏవియేషన్‌ కేపిటల్‌ పేరుతో కార్యకలాపాలు నిర్వహించిన ఎస్‌ఎమ్‌బీసీ ఏవియేషన్‌ కేపిటల్‌.. ప్రపంచంలోని దిగ్గజ విమాన అద్దెల సంస్థల్లో ఒకటిగా ఉంది.

19 వరకు విమానాలన్నీ రద్దు

‘కార్యకలాపాల కారణాల’తో మే 19 వరకు విమాన సర్వీసులన్నీ రద్దు చేస్తున్నట్లు గో ఫస్ట్‌ తాజాగా వెల్లడించింది. ఇందువల్ల ప్రయాణికుల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. త్వరలోనే టికెట్ల డబ్బులను రిఫండ్‌ చేయనున్నట్లు వివరించింది. ఈనెల 12 వరకు విమానాలను రద్దు చేస్తున్నట్లు ఇంతకుముందు సంస్థ ప్రకటించింది.

చరిత్రాత్మక తీర్పు: గో ఫస్ట్‌ సీఈవో

ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు చరిత్రాత్మకమని, గోఫస్ట్‌కు ఎంతో కీలకమైనవని సంస్థ సీఈఓ కౌశిక్‌ ఖోనా అన్నారు. సంస్థ తిరిగి గట్టెక్కేందుకు సరైన సమయంలో వెలువడిన నిర్ణయంగా పేర్కొన్నారు.

గోఫస్ట్‌ పరిణామాలు ఇలా

మే 2- స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ కోసం ఎన్‌సీఎల్‌టీకీ గో ఫస్ట్‌ దరఖాస్తు సమర్పించింది. రుణాల చెల్లింపులకు తాత్కాలిక వాయిదా (మారటోరియం)ను కూడా కోరింది. మే 5 వరకు విమాన సర్వీసులను రద్దు చేసింది.

మే 4- హఠాత్తుగా విమాన సర్వీసులను రద్దు చేయడంపై గో ఫస్ట్‌కు పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. మే 15 వరకు విమాన టిక్కెట్ల విక్రయాలను గో ఫస్ట్‌ నిలిపేసింది. గో ఫస్ట్‌ దివాలా పిటిషన్‌పై తీర్పును ఎన్‌సీఎల్‌టీ రిజర్వ్‌లో ఉంచింది.

మే 5- విమాన సర్వీసులన్నింటినీ మే 12 వరకు సంస్థ రద్దు చేసింది.

మే 8- తన పిటిషన్‌పై సత్వరం నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఎన్‌సీఎల్‌టీని గో ఫస్ట్‌ కోరింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు టిక్కెట్ల విక్రయాలను ఆపేయాలని గో ఫస్ట్‌ను డీజీసీఏ ఆదేశించింది.

మే 9: డీజీసీఏ షోకాజ్‌పై సరైన సమయంలో స్పందిస్తామని గో ఫస్ట్‌ వెల్లడించింది. 45 గో ఫస్ట్‌ విమానాలను డీరిజిస్ట్రేషన్‌ చేయాలంటూ విమానాల అద్దె సంస్థలు కోరాయి.

మే 10: గో ఫస్ట్‌పై దివాలా పరిష్కార ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ అనుమతి. మారటోరియం ఆంక్షల విధింపు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని