ఎంఎస్‌ఎంఈ రుణాలకు ప్రాధాన్యం
కరూర్ వైశ్యా బ్యాంకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,106 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. నూరేళ్లకు పైగా చరిత్ర గల ఈ బ్యాంకు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లకు పైగా నికర లాభాన్ని ఆర్జించటం ఇదే తొలిసారి.
మూడేళ్ల సమష్టి కృషి వల్లే రూ.1,000 కోట్లకు పైగా లాభం
మొండి బాకీలు కట్టడి చేశాం, వడ్డీ మార్జిన్ పెంచుకున్నాం
‘ఈనాడు’ ఇంటర్వ్యూ
కరూర్ వైశ్యా బ్యాంకు ఎండీ, సీఈఓ బి.రమేష్ బాబు
ఈనాడు - హైదరాబాద్
కరూర్ వైశ్యా బ్యాంకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,106 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. నూరేళ్లకు పైగా చరిత్ర గల ఈ బ్యాంకు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లకు పైగా నికర లాభాన్ని ఆర్జించటం ఇదే తొలిసారి. దీని వెనుక మూడేళ్ల సమష్టి కృషి ఉందని బ్యాంకు ఎండీ, సీఈఓ బి.రమేష్ బాబు వివరించారు. ‘స్పష్టమైన కార్యాచరణ నిర్దేశించుకుని ముందుకు సాగాం.. ఎక్కడెక్కడ దిద్దుబాటు అవసరమో గుర్తించి, అమలు చేశాం. ఇందులో బ్యాంకు అధికారులు, సిబ్బంది మొత్తం భాగస్వాములయ్యారు. ఆ ఫలితాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి’ అని ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమేష్ తెలిపారు. అన్ని ప్రమాణాల ప్రకారం బ్యాంకు మెరుగైన స్థితిలో ఉందని.. మున్ముందూ ఇదే జోరు కొనసాగిస్తామని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
2022-23లో అధిక లాభాలు ఎలా సాధ్యమయ్యాయి.
ప్రణాళిక ప్రకారం చేసిన కృషి వల్లే, బ్యాంకు చరిత్రలో ఎన్నడూ లేనంతగా మెరుగైన ఫలితాలను నమోదు చేశాం. మొత్తం వ్యాపారం రూ.1.40 లక్షల కోట్లను అధిగమించింది. రుణాల్లో 16%, డిపాజిట్లలో 12% వృద్ధి నమోదైంది. 2021-22తో పోలిస్తే 64% అధికంగా రూ.1106 కోట్ల నికరలాభాన్ని ఆర్జించాం. రిటర్న్ ఆన్ అసెట్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఎన్‌ఐఎం, పీసీఆర్ (ప్రొవిజన్ కవరేజ్ రేషియో).. అన్నీ మెరుగ్గా నమోదయ్యాయి. బ్యాంకులోని అందరు అధికారులు, సిబ్బంది భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైంది. భిన్నమైన వ్యాపార వ్యూహాలకు తోడు లాభాలు పెంచుకోవడంపై దృష్టి కేంద్రీకరించడం కలిసి వచ్చింది.
మొండి బాకీల సమస్య తగ్గినట్లేనా.
గతంలో అయిదారు పెద్ద కార్పొరేట్ సంస్థలకు భారీ మొత్తంలో రుణాలు ఇచ్చే వాళ్లం. దాంతో రుణాల లక్ష్యం నెరవేరేది. కానీ దానివల్ల మొండి బాకీల సమస్య ఉత్పన్నమయ్యేది. వాటికి కేటాయింపులు చేయడం వల్ల లాభాలు తగ్గేవి. అందుకే రూ.125 కోట్లకు మించిన కార్పొరేట్ రుణాలను తగ్గించి, ఆ స్థానంలో ఎంఎస్‌ఎంఈలకు రుణాలు ఎక్కువగా ఇచ్చాం. వివిధ విభాగాలకు చెందిన ఎక్కువ సంస్థలకు రుణాలు జారీ చేసే సంస్కృతిని తీసుకొచ్చాం. మొండిబాకీల వసూలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఏదైనా ఒక రుణ ఖాతా ఒత్తిడికి గురవుతోందనే సంకేతాలు రాగానే, దానికి పరిష్కారాన్ని అన్వేషిస్తున్నాం. దీనివల్ల పారు బాకీల సమస్య గణనీయంగా తగ్గింది. మార్చి 31 నాటికి స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 2.27 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు (ఎన్‌ఎన్‌పీఏ) 0.74 శాతానికి దిగివచ్చాయి. ఇవి ఇంతకంటే పెరగకుండా చూస్తాం.
ఈ ఆర్థిక సంవత్సరానికి వృద్ధి లక్ష్యాలేమిటి.
కాసా (కరెంటు, సేవింగ్స్ ఖాతాలు) డిపాజిట్లు 34 శాతానికి పెంచుకోవాలని, 3.8 శాతం నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఎం) సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే విధంగా రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్‌ఓఏ) 1.5% ఉండాలని, రుణాలతో పాటు డిపాజిట్లలో 14% చొప్పున వృద్ధి సాధించాలని భావిస్తున్నాం. రుణాలకు సంబంధించి ప్రధానంగా ఎంఎస్‌ఎంఈ విభాగంపై దృష్టి కేంద్రీకరిస్తాం. రిటైల్ విభాగంలో తనఖా రుణాలు అధికంగా ఇవ్వాలనేది లక్ష్యం. కార్పొరేట్ రుణ ఖాతా సగటు మొత్తాన్ని రూ.36.93 కోట్లకు తగ్గించాం. దాదాపుగా దీన్నే కొనసాగిస్తాం. లాభదాయకతతో పాటు వడ్డీ- వడ్డీయేతర ఆదాయాన్ని పెంచుకునేందుకు కృషి చేస్తాం. ఖర్చులు తగ్గించుకోవడానికి అన్ని దారులు వెతుకుతాం.
బ్యాంకు అవసరాలకు అదనపు నిధులు సమీకరించే ఆలోచన ఉందా.
మా బ్యాంకు మూలధన నిష్పత్తి (సీఏఆర్) 18.5 శాతంగా ఉంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం 11% ఉంటే చాలు. అందువల్ల మూలధన నిధుల కోసం మాపై ఒత్తిడి లేదు.
నియామకాలు, శాఖల ఏర్పాటు ప్రణాళికలు ఏమిటి.
బ్యాంకులో ప్రస్తుతం 7,700 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఏడాదిలో 35 కొత్త శాఖలు ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. 250 మంది బిజినెస్ కరెస్పాండెంట్లను నియమించాలని అనుకుంటున్నాం. అవసరాలకు అనుగుణంగా నియామకాలు చేపడతాం. గత కొన్నేళ్లలో ఒక్కో ఉద్యోగి నమోదు చేసే వ్యాపారం మా బ్యాంకులో బాగా పెరిగింది. మూడేళ్ల క్రితం ఇది రూ.13.56 కోట్లు కాగా, ఇప్పుడు రూ.18.14 కోట్లకు పెరిగింది. ఇది ఎంతో సానుకూలాంశం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో అధిక వ్యాపారాన్ని నమోదు చేస్తున్నాం. భవిష్యత్తులో విస్తరణ-ఇతర అంశాల్లో ఈ రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఇస్తాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్