మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ అధిపతిగా పవన్‌ దావులూరి

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌, సర్ఫేస్‌కు కొత్త అధిపతిగా ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థి పవన్‌ దావులూరి నియమితులయ్యారు.

Published : 27 Mar 2024 01:20 IST

ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థి ఈయన

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌, సర్ఫేస్‌కు కొత్త అధిపతిగా ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థి పవన్‌ దావులూరి నియమితులయ్యారు. ఈ బాధ్యతల్లో ఉన్న పనోస్‌ పనయ్‌ గతేడాది అమెజాన్‌కు వెళ్లడంతో తాజా నియామకం చోటు చేసుకుంది. అంతక్రితం విండోస్‌, సర్ఫేస్‌ గ్రూప్‌లను విడదీసి, వాటికి వేర్వేరు అధిపతులను మైక్రోసాఫ్ట్‌ నియమించింది. సర్ఫేస్‌కు దావులూరి, విండోస్‌ విభాగానికి మైఖేల్‌ పరాఖిన్‌ నేతృత్వం వహించేవారు. అయితే పరాఖిన్‌ ‘కొత్త అవకాశాల’ వైపు వెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో విండోస్‌, సర్ఫేస్‌.. రెండు విభాగాల బాధ్యతలనూ దావులూరికే అప్పగించారు. ఇప్పుడు కార్పొరేట్‌ ప్రోడక్ట్‌ చీఫ్‌గా ఆయన వ్యవహరిస్తారు. 23 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్‌లోనే ఈయన పనిచేస్తున్నారు.

సత్యనాదెళ్ల, పిచాయ్‌ సరసన: అమెరికా టెక్‌ దిగ్గజాలకు నాయకత్వ హోదాలో పనిచేస్తున్న భారతీయ సంతతి వ్యక్తులైన సుందర్‌ పిచాయ్‌, సత్య నాదెళ్ల తదితరుల సరసన దావులూరి కూడా చేరినట్లయింది. నేరుగా మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లకే దావులూరి రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌లో గ్రాడ్యుయేషన్‌ అనంతరం మైక్రోసాఫ్ట్‌లో రిలయబిలిటీ కాంపోనెంట్‌ మేనేజర్‌గా పవన్‌ చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని