4-day work: వారానికి నాలుగే పనిరోజులు..! ప్రయోగానికి సిద్ధమైన కంపెనీలు

వారానికి 4 రోజుల పని ఎలా ఉంటుందనే విషయంపై అధ్యయనం చేసేందుకు పలు కంపెనీలు సిద్ధమయ్యాయి.

Published : 30 Jan 2024 02:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి (Coronavirus) నుంచి ప్రపంచ దేశాలు కోలుకున్న నేపథ్యంలో.. ఉద్యోగులు కార్యాలయాల నుంచే విధులు నిర్వర్తించాలని అనేక కంపెనీలు ఆదేశిస్తున్నాయి. పని రోజులను మార్చడం కూడా ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని జర్మన్‌ కంపెనీలు పని రోజులను తగ్గించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. వారానికి 4 రోజుల పని (4-day work) ఎలా ఉంటుందనే విషయంపై అధ్యయనం చేసేందుకు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి నుంచి ఆరు నెలల పాటు దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నాయి.

ఆరు నెలలపాటు అధ్యయనం..

ఫిబ్రవరి 1 నుంచి మొదలయ్యే ఈ అధ్యయనం.. ఆరు నెలల పాటు కొనసాగనుంది. 45 కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి. న్యూజిలాండ్‌కు చెందిన 4డే వీక్‌ గ్లోబల్‌ (4 Day Week Global) అనే స్వచ్ఛందసంస్థ ఈ పైలట్‌ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తోంది. దీని ప్రకారం, ఉద్యోగులు వారానికి కొన్ని గంటలే పని చేయాల్సి ఉంటుంది. జీతం మాత్రం పూర్తిగా చెల్లిస్తారు. అయితే, పని ఫలితం మాత్రం గతంలో మాదిరిగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండేలా చూడాలి. ఇలా పనితీరు మెరుగవడంతో పాటు ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తగ్గడం, తద్వారా సెలవులు తీసుకోవడం కూడా తగ్గనుందని 4డే వీక్‌ అంచనా వేస్తోంది.

ఫెడరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఆక్యుపేషనల్‌ సేఫ్టీ అండ్‌ హెల్త్‌ నివేదిక ప్రకారం, 2022లో జర్మన్‌లు సగటున 21.3 రోజుల పాటు పనిచేయలేకపోయినట్లు తేలింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ 207 బిలియన్‌ యూరోలు నష్టపోయినట్లు అంచనా వేసింది. అంతేకాకుండా సంతోషంగా లేని ఉద్యోగులు పనిలో ఏకాగ్రత కనబరచకపోవడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 8.1 ట్రిలియన్‌ యూరోలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది.

ఉత్తమ ఫలితాలు..

ఇటువంటి ప్రయోగాలు గతంలో అమెరికా, కెనడా, బ్రిటన్‌, పోర్చుగల్‌ దేశాల్లో నిర్వహించినట్లు 4డేస్‌ వీక్‌ గ్లోబల్‌ పేర్కొంది. ఇందులో భాగమైనవారు మానసికంగా, శారీరకంగా ఎంతో మెరుగైనట్లు చెప్పారని తెలిపింది. జర్మనీలోనూ ఇటువంటి ఫలితాలే వస్తాయని ఆశాభావం వ్యక్తంచేసింది. నాలుగు రోజుల పని దినాలపై గతంలో బెల్జియం కూడా ప్రయోగాలు చేసింది. జపాన్‌ కంపెనీలు కూడా వారానికి నాలుగు రోజులను ప్రోత్సహిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి.

ప్రభుత్వం నుంచి వ్యతిరేకత..!

ఐరోపా సమాఖ్యలో పార్ట్‌టైం చేసే వారి సంఖ్య జర్మనీలోనే ఎక్కువగా ఉందని.. తాజా చర్యలతో ఈ సంఖ్య తగ్గుతుందని దీన్ని సమర్థించేవారు చెబుతున్నారు. అయితే, వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని జర్మనీ ఆర్థికశాఖ వ్యతిరేకిస్తోంది. తమ ఆర్థిక వృద్ధికి ముప్పుగా మారనుందని భావిస్తున్నట్లు ఆర్థిక మంత్రి క్రిస్టియన్‌ లిండర్‌ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, ఆర్థిక వ్యవస్థ మందగించడం, అధిక ద్రవ్యోల్బణం, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి కొరత వంటి సమస్యలను జర్మనీ ఎదుర్కొంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి సమయంలో పని రోజులను వారానికి నాలుగుకు కుదించాలని అక్కడి కార్మిక సంఘాలు సూచిస్తున్నాయి. తద్వారా ఉద్యోగుల ఆరోగ్యం, సంతోషంగా ఉండటంతో పనితీరు మెరుగై ఉత్పాదకత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని