Go First: గోఫస్ట్‌కు నిధుల కొరత.. రెండ్రోజుల పాటు సర్వీసుల నిలిపివేత

Go First Airlines: బడ్జెట్‌ ధరలో విమానయాన సేవలందించే గోఫస్ట్‌కు నిధుల కొరత ఎదుర్కొంటోంది. దీంతో మే 3, 4 తేదీల్లో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది.

Updated : 02 May 2023 18:45 IST

ముంబయి: వాడియా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థ గోఫస్ట్‌ నిధుల (Go First) కొరత ఎదుర్కొంటోంది. దీంతో మే 3, 4 తేదీల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రాట్‌ అండ్‌ విట్నీ (P&W) సంస్థ నుంచి ఇంజిన్ల సరఫరాలో జాప్యం కారణంగానే నిధుల కొరత తలెత్తినట్లు ఆ సంస్థ సీఈఓ కౌశిక్‌ కోనా తెలిపారు. అలాగే జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ వద్ద స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసినట్లు తెలిపారు.

గోఫస్ట్‌కు చెందిన 28 విమానాలు నిలిచిపోయాయని కౌశిక్‌ తెలిపారు. ప్రాట్‌ అండ్‌ విట్నీ సంస్థ సకాలంలో ఇంజిన్ల సరఫరా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, తద్వారా నిధుల కొరత ఏర్పడిందని వివరించారు. కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియకు వెళ్లడాన్ని దురదృష్టకరమని పేర్కొన్న ఆయన.. కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దీనికి సంబంధించి పూర్తివివరాలను ప్రభుత్వానికి, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆప్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA)కు తెలియజేసినట్లు కౌశిక్‌ తెలిపారు. దరఖాస్తును NCLT ఆమోదించినట్లయితే.. విమానాలను పునరుద్ధరిస్తామని చెప్పారు. 

గో ఫస్ట్‌ విమాన సంస్థకు 55 విమానాలు ఉన్నాయి. దేశీయ విమానయాన మార్కెట్‌లో ఆ సంస్థకు ప్రస్తుతం (మార్చి నాటికి) 6.9 శాతం వాటా ఉంది. గోఫస్ట్‌కు చెందిన సగానికిపైగా విమానాల్లో ఇంజిన్లలో లోపం కారణంగా గత కొంతకాలంగా నిలిచిపోయాయి. ఒప్పందం ప్రకారం సకాలంలో అమెరికాకు చెందిన పీడబ్ల్యూ సంస్థ ఇంజిన్లను రిపేర్‌ చేయకపోవడం, తగిన విడిభాగాలను సరఫరా చేయకపోవడమే ఇందుకు కారణం. దీనిపై గతంలో డెలావర్‌ ఫెడరల్‌ కోర్టులో గోఫస్ట్‌ సంస్థ ఫిటిషన్‌ కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ సంస్థలో దాదాపు 5 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

డీజీసీఏ షోకాజ్‌ నోటీసు

గోఫస్ట్‌ విమానయాన సంస్థకు డీజీసీఏ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విమాన సర్వీసులను నిలిపివేయడం పట్ల డీజీసీఏ అసహనం వ్యక్తంచేసింది. ప్రయాణికులకు అసౌకర్యానికి గురి చేస్తూ.. ఆమోదించిన టైమ్‌ టేబుల్‌ను పాటించకపోవడంతో నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలంటూ నోటీసుల్లో పేర్కొంది. 24 గంటల్లోనే సమాధానం తెలియజేయాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని