Twitter: ట్విటర్‌లో ‘బ్లూటిక్’ సేవలు మరింత ఆలస్యం

Twitter: నకిలీ ఖాతాలను అరికట్టేందుకు నిలిపివేసిన బ్లూ టిక్‌ చందాను తిరిగి ప్రారంభించేందుకు మరింత సమయం పడుతుందని ఎలాన్‌ మస్క్ వెల్లడించారు.

Updated : 22 Nov 2022 10:45 IST

న్యూయార్క్‌: ట్విటర్‌ ‘బ్లూ టిక్‌’ (Twitter Blue Tick) చందా సేవల పునః ప్రారంభం మరింత ఆలస్యం కానున్నట్లు సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ప్రకటించారు. నకిలీ ఖాతాల్ని అరికట్టడంపై పూర్తి విశ్వాసం ఏర్పడిన తర్వాతే ఈ సేవల్ని తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. అలాగే సంస్థలకు ఇచ్చే వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌ రంగును సైతం మార్చే అవకాశం ఉందని వెల్లడించారు. వ్యక్తిగత ఖాతాదారులకు, సంస్థల ఖాతాలకు తేడా ఉండేలా చూస్తామన్నారు.

నవంబరు 29 నుంచి ‘ట్విటర్‌ బ్లూ’ (Twitter Blue)ను పునః ప్రారంభించనున్నట్లు మస్క్‌ (Elon Musk) ఇటీవల పేర్కొన్నారు. ఖాతాదార్ల వివరాల తనిఖీ అనంతరమే బ్లూటిక్‌ (Blue Tick) ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. పలువురు ప్రముఖుల పేరిట నకిలీ ఖాతాలు వెల్లువెత్తడంతో, కొద్ది రోజులుగా ఈ సేవలను ట్విటర్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 27న మస్క్‌ చేతికి ట్విటర్‌ రాకముందు.. ప్రభుత్వ అధిపతులు, క్రికెటర్లు, సినీ తారలు, ఇతర సెలబ్రిటీల ఖాతా వివరాలను తనిఖీ చేశాకే బ్లూటిక్‌ (Blue Tick) ఇచ్చేవారు. నవంబరు 6న బ్లూటిక్‌ సేవలకు నెలకు 8 డాలర్ల ఫీజు ప్రకటించి, ఎటువంటి తనిఖీలు చేపట్టకుండా ఇచ్చేశారు. దీంతో నకిలీ ఖాతాలు భారీగా కనిపించాయి. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ సేవలను నిలిపివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని