HUL Q4 results: హెచ్‌యూఎల్‌ లాభం ₹2601 కోట్లు.. ఒక్కో షేరుకు ₹22 డివిడెండ్‌

HUL Q4 results: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యూనిలీవర్‌ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. లాభంలో 12 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Published : 27 Apr 2023 15:56 IST

దిల్లీ: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యూనిలీవర్‌ (HUL) గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాలను (Q4 results) గురువారం ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.2,601 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో కంపెనీ నికర లాభం రూ.2,307 కోట్లుగా ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరతో పోలిస్తే నికర లాభంలో 12.74 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం 10.83 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.13,468 కోట్ల ఆదాయం ప్రకటించగా.. ఈ ఏడాదిలో అమ్మకాల ద్వారా కంపెనీకి రూ.14,926 కోట్లు వచ్చిందని కంపెనీ తెలిపింది. మొత్తం ఖర్చులు సైతం రూ.10,782 కోట్ల నుంచి రూ.11,961 కోట్లకు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. ఇక మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం 15.49 శాతం వృద్ధితో రూ.59,443 కోట్లకు చేరిందని హెచ్‌యూఎల్‌ తెలిపింది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.22 చొప్పున డివిడెంట్‌ చెల్లించాలని హెచ్‌యూఎల్‌ బోర్డు నిర్ణయించింది. భౌగోళిక రాజకీయ పరిణామాలు, అధిక ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ కంపెనీ ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించిందని హెచ్‌యూఎల్‌ సీఈఓ సంజీవ్‌ మెహతా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని