మనకి అన్ని ప్రభుత్వ బ్యాంకులక్కర్లేదు: SBI మాజీ చీఫ్‌

ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) మాజీ ఛైర్మన్‌ అరుంధతీ భట్టాచార్య కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి ‘కొన్ని’ ప్రభుత్వరంగ బ్యాంకులుంటే సరిపోతుందని చెప్పారు.

Updated : 28 Sep 2022 20:26 IST

దిల్లీ: ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) మాజీ ఛైర్మన్‌ అరుంధతీ భట్టాచార్య కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి ‘కొన్ని’ ప్రభుత్వరంగ బ్యాంకులుంటే సరిపోతుందని చెప్పారు. అవీ బలమైనవి అయ్యుండాలని పేర్కొన్నారు. చిన్న చిన్న బ్యాంకులను ప్రైవేటీకరించడమో, విలీనం చేయడమో చేయాలని సూచించారు. అదే సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ద్వారా సాధించాలనుకుంటున్న లక్ష్యాలను వాటిని బలోపేతం చేయడం ద్వారా కూడా చేరుకోవచ్చని చెప్పారు. సమస్యలన్నింటికీ ప్రైవేటీకరణ ఒక్కటే సమాధానం కాదని అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థతో ఆమె మాట్లాడారు.

ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అంశంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ఇటీవల తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 10 ఏళ్ల రోడ్‌మ్యాప్‌ తయారుచేసుకుని ప్రభుత్వరంగ బ్యాంకులన్నింటినీ ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దీనిపై సేల్స్‌ఫోర్స్‌ సీఈఓ, ఛైర్మన్‌గా ఉన్న అరుంధతీ భట్టాచార్య స్పందించారు. ‘‘మనకు అధిక సంఖ్యలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండాలి అంటే నేను నమ్మను. ఆ సంఖ్యను తగ్గించొచ్చు. వాటిలో కొన్ని ప్రైవేటీకరించొచ్చు. అయితే, బలమైన బ్యాంకులు మాత్రం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి’’ అని అభిప్రాయపడ్డారు. హోల్‌సేల్‌గా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడమూ సరైనది కాదని పేర్కొన్నారు. ఇటీవల దువ్వూరి సైతం ఇలాంటి అభిప్రాయమే వ్యక్తంచేశారు. ప్రభుత్వ యాజమాన్యంలోని పీఎస్‌బీల ప్రైవేటీకరణకు బిగ్‌ బ్యాంగ్‌ విధానం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు.

2020లో ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకులను విలీనం చేసి 4 పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేసింది. దీంతో దేశంలో వీటి సంఖ్య 12కు తగ్గింది. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం 2 పీఎస్‌బీల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం పాలసీని ఆమోదించిన సంగతి తెలిసిందే. నీతిఆయోగ్‌ కూడా 2 బ్యాంకులు, ఒక బీమా కంపెనీలో పెట్టుబడుల్ని ఉపసంహరించవచ్చని సూచించింది. ఇందులో భాగంగా ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాల విక్రయానికి కేంద్రం సన్నద్ధమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని