GST Tax rates: జీఎస్టీ రేట్ల సవరణ ఇప్పట్లో లేనట్లే..!

జీఎస్టీ విషయంలో ఇప్పట్లో తీపి కబురు లేనట్లే. పన్ను శ్లాబుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఎలాంటి మార్పులూ చేసే అవకాశం లేదని తెలిసింది.

Published : 06 Feb 2023 23:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వస్తు, సేవల పన్ను (GST) విధానంలో ఇప్పట్లో మార్పులు లేనట్లే! కొన్ని పన్ను రేట్లను (Tax rates) విలీనం చేసి ఆ మేర వినియోగదారులపై భారం తగ్గిస్తారంటూ ఏడాదికి పైగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంలో ఇప్పట్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని తెలిసింది. ప్రస్తుత జీఎస్టీ పన్ను విధానంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి మార్పులూ చేసే అవకాశం లేదని రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

జీఎస్టీలో ప్రస్తుతం ఐదు రకాల పన్ను శ్లాబులు ఉన్నాయి. వివిధ రకాల వస్తువులు, సేవలపై 0-28 శాతం మధ్య పన్ను విధిస్తున్నారు. అయితే, ఇందులో కొన్ని శ్లాబులను విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందంటూ 2021 నుంచీ వార్తలు వస్తున్నాయి. అధిక సంఖ్యలో శ్లాబులు ఉండడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు జీఎస్టీ పన్ను విధానంలో చిన్న చిన్న మార్పులు మినహాయిస్తే.. భారీ స్థాయిలో మార్పులకు అవకాశం లేదని మల్హోత్రా పేర్కొన్నారు. ప్రస్తుతం జీఎస్టీ విధానాన్ని స్థిరంగా ఉంచడంపై దృష్టి సారించామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023-24) ఎలాంటి మార్పులూ ఉండబోవని చెప్పారు. తక్కువ సంఖ్యలో పన్ను శ్లాబులు ఉండాలని ప్రభుత్వం సైతం కోరుకుంటోందని, అది ఎప్పుడనేది మాత్రం చెప్పలేనన్నారు. జీఎస్టీతో పాటు కస్టమ్‌ డ్యూటీ పన్ను విధానాన్ని సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని మల్హోత్రా చెప్పారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లలో 12 శాతం వృద్ధి నమోదు అయ్యే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌పై విధిస్తున్న విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ ద్వారా రూ.25వేల కోట్లు ఆర్జించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్‌ ఈ నెల 18న దిల్లీలో భేటీ కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని