UPI: వినియోగదారుడిపై UPI ఛార్జీల భారం ఉండదు.. స్పష్టం చేసిన ఎన్‌పీసీఐ
రూ.2,000కు పైబడిన లావాదేవీ విలువలో 1.1 శాతం మేర ఇంటర్‌ఛేంజ్ ఛార్జీని వసూలు చేయాలని ఎన్‌పీసీఐ సూచించింది.
దిల్లీ: ఆన్‌లైన్ వాలెట్లు, ప్రీ-లోడెడ్ గిఫ్ట్ కార్డుల వంటి ‘ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI)’ ద్వారా చేసే యూపీఐ మర్చంట్ లావాదేవీలపై అదనపు ఛార్జీలను విధించాలని ఎన్‌పీసీఐ సిఫారసు చేసింది. ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)’ ప్రతిపాదించింది. అయితే, ఈ ఏడాది సెప్టెంబరు 30న లేదా అంతకంటే ముందే వీటిపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.
ఎన్‌పీసీఐ సర్క్యులర్ ప్రకారం..రూ.2,000కు పైబడిన లావాదేవీ విలువలో 1.1 శాతం మేర ఇంటర్‌ఛేంజ్ ఛార్జీ (Interchange fees)ని వసూలు చేయాలని సూచించింది. అదనపు ఛార్జీలు అమల్లోకి వస్తే, వాలెట్ లోడింగ్‌కు సేవా ఛార్జీని బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంటుంది. పీ2పీ, పీ2పీఎం లావాదేవీలకు బ్యాంక్ ఖాతా, పీపీఐ వాలెట్‌కు ఎటువంటి ఛార్జీలు ఉండవు.
ఇంటర్‌ఛేంజ్ ఛార్జీ అంటే..
వాలెట్‌లను జారీచేసే బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల వంటి వాటికి పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు చెల్లించే రుసుములనే ఇంటర్‌ఛేంజ్ ఛార్జీ (Interchange fees) అంటారు. లావాదేవీల ధ్రువీకరణ, ప్రాసెసింగ్‌కు అయ్యే వ్యయాల కోసం ఈ ఛార్జీని వసూలు చేస్తాయి.
రోజువారీ యూపీఐ చెల్లింపులపై..
అయితే, యూపీఐ (UPI)తో జరిపే ప్రతి లావాదేవీపై అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని చాలా మందిలో సందేహం నెలకొంది. కానీ, దాంట్లో వాస్తవం లేదు. వ్యక్తుల మధ్య, వ్యక్తి నుంచి వ్యాపారుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుము ఉండదు. అంటే సామాన్య ప్రజలు రోజువారీ చెల్లింపుల కోసం యూపీఐ యాప్‌లను వినియోగిస్తే ఎలాంటి అదనపు రుసుము వర్తించదు.
లోడింగ్ రుసుము కూడా..
పీపీఐ ద్వారా రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీ జరిపితే 1.1 శాతం ఇంటర్‌ఛేంజ్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వాలెట్ లోడింగ్ సేవా రుసుము కూడా వర్తిస్తుంది. పేటీఎం, గూగుల్ పే వంటి పీపీఐ జారీ సంస్థలు 15 బేసిస్ పాయింట్లు వాలెట్ లోడింగ్ ఛార్జీని ఖాతాదారుడి బ్యాంకుకి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పీపీఐ జారీ సంస్థలు దీన్ని వినియోగదారులకు బదిలీ చేస్తే అప్పుడు లోడింగ్ రుసుముల భారం సామాన్యులపై పడుతుంది.
ఇంటర్‌ఛేంజ్ ఛార్జీల్లో వ్యత్యాసం..
మర్చంట్ ప్రొఫైల్‌ను బట్టి ఇంటర్‌ఛేంజ్ ఛార్జీల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. ఈ చార్జీలు 0.50- 1.10 శాతం మధ్య ఉంటాయని తెలిపింది. ఉదాహరణకు పీపీఐ ద్వారా పెట్రోల్ పంపుల్లో యూపీఐ లావాదేవీ జరిపితే 0.5 శాతం ఇంటర్‌ఛేంజ్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే స్కూలు, కాలేజీ ఫీజులు చెల్లిస్తే ఇది 0.70 శాతం వరకు ఉంటుంది.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఓ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం..
ఒక వ్యక్తికి ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఖాతా ఉందనుకుందాం. అలాగే అతను పేటీఎం వాలెట్‌ను ఉపయోగిస్తున్నాడు. బ్యాంకు ఖాతా నుంచి వాలెట్‌కు రూ.5,000 లోడ్ చేశాడు. అప్పుడు పేటీఎం 15 బేసిస్ పాయింట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌కి లోడింగ్ రుసుముల కింద చెల్లించాలి.
ఇప్పుడు ఆ వ్యక్తి మొబైల్ ఫోన్ కొనడానికి ఓ రిటైలర్ దగ్గరకు వెళ్లారు. పేటీఎం వాలెట్ నుంచి యూపీఐ లావాదేవీ ద్వారా చెల్లించాడు. అప్పుడు రిటైలర్‌ను మర్చంట్‌గా గుర్తించి అతనికి సేవలు అందిస్తున్న బ్యాంకు లేదా ఇతర వేదికలు పేటీఎంకు 1.1 శాతం ఇంటర్‌ఛేంజ్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. లావాదేవీని సులభతరం చేసినందుకుగానూ ఈ రుసుము వర్తిస్తుంది.
ఎన్‌పీసీఐ స్పష్టత..
ఈ ఇంటర్‌ఛేంజ్ ఛార్జీల వల్ల సామాన్యులపై భారం పడొచ్చంటూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్‌పీసీఐ స్పష్టతనిచ్చింది. బ్యాంకు ఖాతా నుంచి ఖాతాకు, వినియోగదారులకు-వ్యాపారులకు మద్య ఉచితంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఇంటర్ చేంజ్ ఛార్జీలు పీపీఐ వ్యాపారి లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. అంటే వ్యక్తుల మధ్య, వ్యక్తి నుంచి వ్యాపారుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుములు ఉండవు. ఇదే విషయాన్ని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సైతం స్పష్టం చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Tragedy: విపత్తు వేళ మానవత్వం.. రక్తదానానికి కదిలొచ్చిన యువకులు
-
General News
odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
-
India News
Trains Cancelled: ఒడిశా రైలు ప్రమాదం.. 43కుపైగా రైళ్లు రద్దు..
-
India News
Odisha Train Tragedy: అంతా 20 నిమిషాల వ్యవధిలోనే.. నిద్రలోనే మృత్యుఒడిలోకి..!
-
India News
Ashwini Vaishnaw: రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
-
World News
అడవిలో.. పాపం పసివాళ్లు ఏమయ్యారో!