Adani Group: హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత తొలిసారి.. విదేశీ రుణం కోసం ‘అదానీ’ కంపెనీ ప్రయత్నాలు!

Adani Group: అదానీకనెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జాయింట్‌ వెంచర్‌ రుణం కోసం పలు విదేశీ బ్యాంకులతో ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్లు కంపెనీకి చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు వెల్లడించారు.

Published : 04 Apr 2023 17:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డేటా సెంటర్‌ ప్రొవైడర్‌ ఎడ్జ్‌కనెక్స్‌తో కలిసి అదానీ గ్రూప్‌ (Adani Group) ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ విదేశీ రుణాలను సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ మేరకు వివిధ బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 220 మిలియన్‌ డాలర్ల రుణం కోసం ప్రయత్నిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు ఉన్నతోద్యోగులు తెలిపారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూప్‌ (Adani Group)నకు చెందిన ఓ సంస్థ ఇలా విదేశీ రుణ సమీకరణకు అడుగులు వేయడం ఇదే తొలిసారి.

అదానీకనెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే జాయింట్‌ వెంచర్‌ పలు విదేశీ బ్యాంకులతో ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్లు కంపెనీకి చెందిన ఇద్దరు కీలక వ్యక్తులను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్‌ కథనం ప్రచురించింది. దాదాపు ఐదేళ్ల కాలపరిమితితో ఈ రుణం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే కొన్ని వారాల్లో ఈ రుణ మంజూరు ప్రక్రియ పూర్తవుతుందని కంపెనీ ఆశిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ రుణం మంజూరైతే.. ఆ నిధులను డేటా సెంటర్ల మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించనున్నట్లు తెలుస్తోంది.

అదానీ గ్రూప్‌ (Adani Group) తమ నమోదిత కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని 2023 జనవరి 23న వెలువడిన నివేదికలో అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. అలా విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలను పొందిందని ఆరోపించింది. అలాగే అకౌంటింగ్ మోసాలకు సైతం పాల్పడినట్లు పేర్కొంది. ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్‌ (Adani Group) తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ.. అదానీ నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ భారీగా పడిపోయింది. మరోవైపు మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ.. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై దర్యాప్తు చేస్తోంది. ఈ తరుణంలో అదానీకి చెందిన ఓ కంపెనీ మరోసారి విదేశీ రుణాల కోసం ప్రయత్నిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని