LIC Market share: ఎల్‌ఐసీ మార్కెట్‌ వాటాలో క్షీణత.. పెరిగిన ‘ప్రైవేట్‌’ షేర్‌!

LIC market share: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ మార్కెట్‌ వాటా సెప్టెంబర్‌ నెలలో క్షీణించింది. గతేడాదితో పోలిస్తే దాదాపు 10 శాతం మేర వాటా తగ్గింది. అదే సమయంలో ప్రైవేటు వాటా స్వల్పంగా పెరిగింది.

Published : 10 Oct 2023 15:45 IST

LIC market share | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) మార్కెట్‌ వాటా క్షీణించింది. జీవిత బీమా రంగంలో తనకు ఎదురులేదంటూ ఇన్నాళ్లు నిరూపించుకుంటూ వచ్చిన ఆ సంస్థ.. మార్కెట్‌ వాటా (LIC market share) సెప్టెంబర్‌ నెలలో తగ్గుముఖం పట్టింది. ఎల్‌ఐసీ కొత్త బిజినెస్‌ ప్రీమియం వసూళ్లు దాదాపు 10 శాతం మేర తగ్గాయి. గతేడాది ఇదే సమయంలో 68.25 శాతంగా ఉన్న ఎల్‌ఐసీ మార్కెట్‌ వాటా.. ఈ ఏడాది 58.50 శాతానికి తగ్గింది. అదే సమయంలో ప్రైవేటు సంస్థల మార్కెట్‌ వాటా స్వల్పంగా పెరగడం గమనార్హం. అయితే, ప్రైవేటు సంస్థల అన్నింటి వాటా కలిపినా ఎల్‌ఐసీ మార్కెట్‌ వాటాకు ఇంకా చాలా దూరంలో ఉండడం గమనార్హం.

ఎల్‌ఐసీ సహా వివిధ జీవిత బీమా సంస్థల సెప్టెంబర్‌ నెల వ్యాపార సరళికి సంబంధించిన డేటాను లైఫ్‌ ఇన్సురెన్స్‌ కౌన్సిల్‌ తాజాగా వెల్లడించింది. సెప్టెంబర్‌ నెలలో రూ.92,462 కోట్ల విలువైన కొత్త పాలసీలను ఎల్‌ఐసీ విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో రూ.1.25 లక్షల కోట్ల విలువైన ప్రీమియంలను ఎల్‌ఐసీ విక్రయించడం గమనార్హం. పార్టిసిపేటింగ్‌ ప్రొడక్ట్‌లు తక్కువగా అమ్ముడవ్వడం, నాన్‌ పార్టిసిపేటింగ్‌ ప్రొడక్ట్‌లు తగినంత లేకపోవడం, కొన్ని బీమా ప్లాన్‌ల ఫీచర్లు, ధరల్లో మార్పులు వంటివి ఎల్‌ఐసీ మార్కెట్‌ క్షీణతకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

వాట్సాప్‌లో త్వరలో ‘సీక్రెట్‌ కోడ్‌’.. ఇంతకీ ఎలా పనిచేస్తుందంటే?

అదే సమయంలో ప్రైవేటు ఇన్సురెన్స్‌ సంస్థల మార్కెట్‌ వాటా పుంజుకోవడం గమనార్హం. 2022 సెప్టెంబర్‌లో 31.75 శాతంగా ఉన్న వీటి వాటా.. ఈ ఏడాది 41.50 శాతానికి పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సురెన్స్‌నే తీసుకుంటే.. సెప్టెంబర్‌లో మార్కెట్‌ వాటా 6.07 శాతం నుంచి 8.31 శాతానికి పెరిగింది. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌ వాటా 7.19 శాతం నుంచి 10.27 శాతానికి పెరిగింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌, బజాజ్‌ అలియాన్జ్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌, మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌ మార్కెట్‌ వాటా సైతం ఒక్కో శాతం మేర పెరగడం గమనార్హం.

మరోవైపు ఇప్పటికీ ఏజెంట్ల నెట్‌వర్క్‌పైనే ఎల్‌ఐసీ ఎక్కువగా ఆధారపడుతోందని అనలిస్టులు చెబుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జరిగిన వ్యాపారంలో 96 శాతం కొత్త పాలసీలు.. ఏజెంట్లు, ఇన్సురెన్స్‌ అడ్వైజర్ల రూపంలో వచ్చినవే. అదే సమయంలో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌ 18, హెచ్‌డీఎఫ్‌సీ 20 శాతం పాలసీలు మాత్రమే ఏజెంట్ల నుంచి రావడం గమనార్హం. ప్రైవేటు కంపెనీలు ప్రధానంగా డిజిటల్‌ బాట పడుతుండగా.. ఎల్‌ఐసీ మాత్రం ఇంకా ఏజెంట్లపైనే ఆధారపడుతోందని పేర్కొంటున్నారు. యువత ఎక్కువగా డిజిటల్‌ సర్వీసులను కోరుకుంటున్నారని, ఏదైనా సమస్య ఎదురైతే పరిష్కారానికి కూడా ఆన్‌లైన్‌పైనే ఆధారపడుతున్నారని చెబుతున్నారు. ప్రైవేటు సంస్థలు డిజిటల్‌ విషయంలో ముందంజలో ఉన్నాయని పేర్కొంటున్నారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని