Mutual funds: మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.39 లక్షల కోట్లు

2021లో మ్యూచువల్‌ ఫండ్లలో గణనీయంగా పెరిగిన పెట్టుబడులు 2022లో నెమ్మదించాయి. దీనికి స్టాక్‌ మార్కెట్‌లోని పరిస్థితులే కారణమని యాంఫీ తెలిపింది.

Published : 10 Jan 2023 18:38 IST

దిల్లీ: మ్యూచువల్‌ ఫండ్ల (Mutual fund- MF) పరిశ్రమ ‘నిర్వహణలోని ఆస్తుల విలువ (AUM)’ 2022లో 5.7 శాతం పెరిగి రూ.39.88 లక్షల కోట్లకు చేరింది. ‘నెలవారీ క్రమానుగత పెట్టుబడుల (SIP)’ల్లో స్థిరవృద్ధే అందుకు దోహదం చేసినట్లు ‘మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ సమాఖ్య (Amfi)’ మంగళవారం తెలిపింది. 2021లో ఎంఎఫ్‌ల ఏయూఎం 22 శాతం (రూ.7 లక్షల కోట్లు) పెరిగిన విషయం తెలిసిందే.

స్టాక్ మార్కెట్లలో అస్థిరత, వడ్డీరేట్ల పెంపు వంటి కారణాల వల్ల 2022లో మ్యూచువల్‌ ఫండ్లలోకి పెట్టుబడులు నెమ్మదించినట్లు యాంఫీ తెలిపింది. దీంతో మదుపర్లు తమ నిధులను ఈక్విటీ, డెట్‌, హైబ్రిడ్‌ పథకాల మధ్య పదే పదే తరలించినట్లు వెల్లడించింది. 2021లో స్టాక్‌ మార్కెట్లలో వచ్చిన భారీ ర్యాలీ ఎంఎఫ్‌లలో గణనీయ వృద్ధికి దోహదం చేసిన విషయం తెలిసిందే.

2022లో సిప్‌లలో స్థిరవృద్ధి నమోదైంది. నవంబరులో రికార్డు స్థాయిలో రూ.13,000 కోట్లు మదుపు చేశారు. ఏడాది మొత్తంలో నెలవారీ సగటు సిప్‌ల విలువ రూ.12,500 కోట్లుగా నమోదైంది. మరోవైపు యాంఫీ సైతం ప్రజల్లో మ్యూచువల్‌ ఫండ్లపై అవగాహన పెంచడం కోసం విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించింది. 2023లోనూ సిప్‌ల హవా కొనసాగుతుందని యాంఫీ అంచనా వేసింది.

2022లో అత్యధికంగా ఎంఎఫ్‌ ఈక్విటీ పథకాల్లోకి మదుపర్లు నిధులను (నికరంగా రూ.1.61 లక్షల కోట్లు) మళ్లించారు. తర్వాత ఇండెక్స్‌ ఫండ్లు, ఈటీఎఫ్‌ల్లో (రూ.1.65 లక్షల కోట్లు) మదుపు చేశారు. అదే సమయంలో డెట్‌ ఫథకాల నుంచి (రూ. 2.5 లక్షల కోట్లు) ఉపసంహరించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని