Netflix: పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు రుసుము.. కొత్త ఏడాదిలో యూజర్లకు షాకివ్వనున్న నెట్‌ఫ్లిక్స్‌!

నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ఏడాదిలో యూజర్లకు షాకివ్వనుంది. 2023 నుంచి యూజర్లు తమ ఖాతాల పాస్‌వర్డ్‌లను ఇతరులతో షేర్‌ చేయాలంటే అదనంగా కొంత రుసుము చెల్లించాలి. 

Updated : 22 Dec 2022 20:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సమయంలో థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులు ఓటీటీ (OTT)ల వైపు మొగ్గుచూపారు. వీటిలో ఒక యూజర్‌ ఐడీ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ డివైజ్‌లలో వీక్షించే వెసులుబాటు ఉండటంతో.. చాలా మంది యూజర్లు తమ ఐడీ, పాస్‌వర్డ్‌లను స్నేహితులు, బంధువులతో షేర్‌ చేసుకోవడం ప్రారంభించారు. సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గిపోవడానికి ఇది ప్రధానకారణంగా ఓటీటీ సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాస్‌వర్డ్‌ షేరింగ్‌ ఫీచర్‌ను నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) తొలగించాలని భావిస్తోంది. 2023 నుంచి యూజర్లు తమ నెట్‌ఫ్లిక్స్ ఖాతాల పాస్‌వర్డ్‌లను ఇతరులతో షేర్‌ చేయడం సాధ్యంకాదని వాల్‌స్ట్రీట్ జర్నల్‌ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. 

గత పదేళ్లలో ఎన్నడూలేనంతగా సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గిపోయినట్లు ఈ ఏడాది మొదట్లో నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. పాస్‌వర్డ్‌ షేరింగ్‌ వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు భావించిన నెట్‌ఫ్లిక్స్ ఈ ఫీచర్‌ను తొలగించాలని నిర్ణయించింది. ఒకవేళ యూజర్లు తమ పాస్‌వర్డ్‌ను ఇతరులతో షేర్‌ చేసుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌కు అదనంగా కొంత రుసుము చెల్లించాలి. వచ్చేఏడాది నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌ ఈ విధానాన్ని లాటిన్‌ అమెరికా, కోస్టారికా, చిలీ, పెరూ వంటి దేశాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఆ దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్ రుసుము మూడు డాలర్లుగా (సుమారు రూ. 250)గా కంపెనీ నిర్ణయించింది. ఒకవేళ యూజర్‌ రుసుము చెల్లించకుండా పాస్‌వర్డ్‌ షేర్‌ చేస్తే.. ఐపీ అడ్రస్‌, డివైజ్‌ ఐడీ, అకౌంట్‌ యాక్టివిటీ ఆధారంగా వాటిని అడ్డుకుంటుంది. గత కొద్దినెలలుగా సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ తీవ్రంగా కృషి చేస్తోంది. అందులో భాగంగా పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను తొలగించనుంది. 

నెట్‌ఫ్లిక్స్‌ ఇటీవలే యాడ్‌లతో కూడిన కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను 6.99 డాలర్ల (సుమారు రూ. 578)కు అమెరికాలో పరిచయం చేసింది. త్వరలోనే ఈ ప్లాన్‌ను ఇతర రీజియన్లలో తీసుకొస్తారని సమాచారం. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ భారత్‌లో నాలుగు ప్లాన్లను అందిస్తోంది. అవి మొబైల్‌, బేసిక్‌, స్టాండర్డ్‌, ప్రీమియం ప్లాన్లు. మొబైల్ ప్లాన్‌ నెలవారీ రుసుము రూ. 149, బేసిక్‌ ప్లాన్‌ రుసుము రూ. 199కాగా, స్టాండర్డ్‌ ప్లాన్‌ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ధర రూ. 199, ప్రీమియం ప్లాన్‌కు రూ. 649 చెల్లించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని