జీతం పెరగకపోయినా మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు.. ఉద్యోగులకు Microsoft CMO సూచన!

ప్రతిఒక్కరూ స్టాక్‌ ధర పెరిగేలా పనిచేయాలని మైక్రోసాఫ్ట్‌ సీఎంఓ ఉద్యోగులకు రాసిన లేఖలో సూచించారు. మెరుగైన త్రైమాసిక ఫలితాలు సాధిస్తే.. స్టాక్‌ ధర ఆకర్షణీయంగా మారుతుందని వెల్లడించారు. 

Updated : 21 May 2023 13:32 IST

వాషింగ్టన్‌: ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలను పెంచడం లేదని టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ (Microsoft) ఇటీవల ప్రకటించింది. దీనిపై కంపెనీ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. కొంత మంది బహిరంగంగానే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే, కంపెనీ వేతనం పెంచకపోయినా.. ఉద్యోగులు తమ ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని సీఎంఓ సూచించారు.

వేతన పెంపు విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులకు ఇటీవల చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ క్రిస్టోఫర్‌ ఓ అంతర్గత లేఖ రాసినట్లు ఫార్చూన్‌ పత్రిక పేర్కొంది. కంపెనీ తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలను వివరిస్తూనే.. పరిహారం పెంచుకునే మార్గాన్ని అందులో సూచించారు. కంపెనీ స్టాక్‌ ధర పెరిగితే.. ఆటోమేటిక్‌గా మీకు అందే పరిహారం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ స్టాక్‌ ధర పెరిగేలా పనిచేయాలని సూచించారు. మెరుగైన త్రైమాసిక ఫలితాలు సాధిస్తే.. స్టాక్‌ ధర ఆకర్షణీయంగా మారుతుందని తెలిపారు. ఇప్పటికే ఈ ఏడాది కంపెనీ షేరు విలువ 33 శాతం పెరిగినట్లు క్రిస్టోఫర్‌ తన లేఖలో గుర్తు చేశారు.

ఆర్థికంగా అనేక అస్థిర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది ఉద్యోగులకు వేతన పెంపులు ఉండవని మైక్రోసాఫ్ట్‌ (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల స్వయంగా వెల్లడించారు. అయితే, బోనస్‌లు, స్టాక్‌ అవార్డులు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. మరోవైపు ఇతర టెక్‌ కంపెనీల తరహాలోనే మైక్రోసాఫ్ట్‌ సైతం ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో 10వేల మందిని తీసివేస్తున్నట్లు ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు