Pranjali Awasthi: 16 ఏళ్లకే ఏఐ స్టార్టప్‌.. రెండేళ్లలో రూ.100 కోట్ల టర్నోవర్‌

ఏడేళ్ల వయసులో సొంతంగా కోడింగ్‌ రాసి.. 13 ఏళ్లకే ఫ్లోరిడా యూనివర్సిటీలో ఇంటర్న్‌షిప్‌ చేసి, 16 ఏళ్లకు స్టార్టప్‌ నెలకొల్పి.. రెండేళ్లలో దాని విలువను రూ.100 కోట్లు పెంచిన అమ్మాయి సక్సెస్‌ స్టోరీ వివరాలివే. 

Updated : 11 Oct 2023 19:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన వయసు పిల్లలంతా కాలేజీకి వెళుతూ పుస్తకాలతో కుస్తీ పడుతుంటే.. 16 ఏళ్ల ప్రాంజలి అవస్థీ (Pranjali Awasthi) మాత్రం బోర్డ్ మీటింగ్‌లో బిజీగా గడుపుతోంది. అంతేకాదు.. తన కంపెనీకి పెట్టుబడులు రాబట్టేందుకు టెక్‌ సమ్మిట్‌లో పాల్గొంటూ తీరికలేకుండా పనిచేస్తోంది. ఓ వైపు స్కూల్‌కు వెళుతూనే.. మరోవైపు కంపెనీని వృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రెండేళ్ల క్రితం రూ. మూడున్నర కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఆమె కంపెనీ.. ప్రస్తుతం రూ.100 కోట్లు విలువ కలిగిన సంస్థగా అవతరించిందంటే.. దాని వెనుక ప్రాంజలి కృషిని అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఎవరీ ప్రాంజలి అవస్థీ? 16 ఏళ్లకే కంపెనీ స్థాపించడం ఎలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే.. 

‘‘చిన్నతనంలో మా నాన్న ఉపయోగిస్తున్న కంప్యూటర్‌ను తదేకంగా గమనిస్తుండటంతో.. దాన్ని ఎలా ఉపయోగించాలో నాన్న నాకు నేర్పించారు. అలా నేను ఆయనతో కూర్చుని కోడింగ్‌ రాయడం కొద్ది కొద్దిగా నేర్చుకునేదాన్ని. ఏడేళ్ల వయసులో తొలిసారి సొంతంగా కోడింగ్ రాశా. తర్వాత, 11 ఏళ్లకు మా కుటుంబం అమెరికాలోని ఫ్లోరిడాకు వెళ్లాం. అక్కడ స్కూల్లో కంప్యూటర్‌ సైన్స్ అండ్ కాంపిటీటివ్ మ్యాథ్య్స్ కోర్సులో చేరాను. రెండేళ్ల తర్వాత ఫ్లోరిడా యూనివర్సిటీలో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం లభించింది. అలా, 13 ఏళ్లకే ఓ వైపు ఇంటర్న్‌షిప్‌ చేస్తూ.. మరోవైపు స్కూలుకు వెళ్లేదాన్ని. వారంలో 20 గంటలు ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు అనుమతి ఉండేది. ఆ సమయంలోనే నాకు కృత్రిమ మేధ (AI) గురించి తెలిసింది. దాని సాయంతో చాలా పనులు సులభంగా చేయొచ్చని గ్రహించి, ఆ దిశగా ఇంటర్న్‌షిప్‌లో పరిశోధనలు చేసేదాన్ని. కరోనా పరిస్థితుల తర్వాత ఏఐకి డిమాండ్ పెరగడంతో కంపెనీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. ఇంటర్న్‌షిప్‌ పూర్తి కాగానే.. కొద్దిరోజులు ఏఐకు సంబంధించిన స్టార్టప్‌ కంపెనీలో పనిచేశా. తర్వాత 2021లో డెల్వ్‌.ఏఐ (Delv.AI) పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించా. నేను, మరో ముగ్గురు ఉద్యోగులు, రూ.మూడున్నర కోట్ల పెట్టుబడితో సంస్థ ప్రయాణం మొదలైంది. ప్రస్తుతం మా కంపెనీలో పది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ విలువ రూ.100 కోట్లకు చేరింది’’అని మియామీలో జరిగిన టెక్‌ ఈవెంట్‌లో ప్రాంజలి వివరించింది. 

వివిధ అంశాలపై పరిశోధనలు చేసే వారికి ఆన్‌లైన్‌లో కచ్చితమైన సమాచారం అందించడమే తమ సంస్థ లక్ష్యమని ప్రాంజలి తెలిపింది. కంపెనీని మరింత విస్తరించేందుకు కొంతకాలంపాటు చదువుకు విరామం ఇచ్చి.. భవిష్యత్తులో కంపెనీ నిర్వహణకు అవసరమైన కోర్సులో గ్రాడ్యుయేషన్ కోర్సు చేస్తానని ధీమా వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు