Recession: జర్మనీని కమ్మేసిన మాంద్యం మబ్బులు

ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీలో ఆర్థిక మాంద్యం మబ్బులు కమ్ముకొంటున్నాయి.....

Published : 27 Sep 2022 01:49 IST

ఫ్రాంక్‌ఫర్ట్‌: ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీలో ఆర్థిక మాంద్యం మబ్బులు కమ్ముకొంటున్నాయి. ఆ దేశంలో వ్యాపార వృద్ధిని సూచించే ఐఎఫ్‌ఓ సర్వే సూచీ సెప్టెంబరులో 84.3కు పడిపోయింది. ఆగస్టులో ఇది 88.5గా నమోదైంది. ప్రస్తుతం ఈ సూచీ 2008 నాటి ప్రపంచ మహామాంద్యం స్థాయికి కుంగింది.

ఇంధన, కమొడిటీ ధరలు భారీగా పెరగడంతో అక్కడి వ్యాపార కార్యకలాపాలు నెమ్మదించాయి. గిరాకీ పూర్తిగా పడిపోయి కంపెనీల లాభాలు తగ్గిపోయాయి. మరోవైపు కమొడిటీ ధరలు పెరగడంతో కంపెనీలకు నిర్వహణ, తయారీ వ్యయాలు ఎగబాకాయి. ఈ భారాన్ని ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరవుతున్న వినియోగదారులపైకి మోపలేని పరిస్థితి. కంపెనీలకు ఆర్డర్లు పూర్తిగా పడిపోయాయి. బేకరీల వంటి ఇంధన ఆధారిత వ్యాపారాలు దాదాపు మూసివేసే దశకు చేరుకున్నాయి. ఈ దెబ్బతో యావత్తు ఐరోపా మాంద్యంలోకి జారుకోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభంతో ఐరోపాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యుద్ధానికి ముందు రష్యా నుంచి జర్మనీ చాలా చౌకగా పైప్‌లైన్‌ ద్వారా సహజవాయువును పొందేది. కానీ, రష్యా సైనిక చర్యను నిలువరించే లక్ష్యంతో ఆ దేశ ఇంధన దిగుమతులపై ఐరోపా దేశాలు ఆంక్షలు విధించాయి. జర్మనీలో ఇళ్లను వెచ్చగా ఉంచడానికి, ఫ్యాక్టరీల్లో తయారీకి, విద్యుదుత్పత్తికి గ్యాస్‌ను వినియోగిస్తారు. కానీ, రష్యా నుంచి సరఫరా నిలిచిపోవడంతో అవన్నీ స్తంభించిపోయాయి. దీంతో అత్యంత ఖరీదైన లిక్విఫైడ్‌ గ్యాస్‌ను అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. పైగా రష్యా నుంచి పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ వచ్చేది. ఇప్పుడు నౌకల ద్వారా తెప్పించుకోవాల్సి వస్తోంది. దీంతో రవాణా వ్యయాలు ధరలపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ఇటీవల సౌదీ అరేబియా, యూఏఈ, కతర్‌తో చర్చలు జరిపారు. కొన్ని ఇంధన ఒప్పందాలు కుదుర్చుకొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని