Russia: రష్యా వాంటెడ్‌ లిస్ట్‌లో మెటా అధికార ప్రతినిధి

Russia: స్వతంత్ర మీడియాపై ఆంక్షల్లో భాగంగా రష్యా ఇప్పటికే మెటాను నిషేధించింది. తాజాగా ఆ కంపెనీకి చెందిన అధికార ప్రతినిధిపై నేరాభియోగాలు మోపుతూ వాంటెడ్‌ లిస్ట్‌లో చేర్చింది.

Updated : 27 Nov 2023 10:59 IST

మాస్కో: అమెరికా టెక్‌ దిగ్గజం ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా (Meta) అధికార ప్రతినిధి ఆండీ స్టోన్‌ను రష్యా తమ వాంటెడ్‌ లిస్ట్‌ (Russia Wanted List)లో చేర్చింది. ఈ మేరకు తమ ఆన్‌లైన్‌ డేటాబేస్‌లో ఆండీ పేరును ఆ దేశ హోంశాఖ చేర్చింది. అక్టోబర్‌లో మెటా (Meta)ను రష్యా అధికారిక వర్గాలు ఓ తీవ్రవాద సంస్థగా పేర్కొన్నాయి. ఫలితంగా ఈ సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించే తమ దేశ పౌరులపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది.

ఆండీ స్టోన్‌పై ఉన్న అభియోగాలేంటనే విషయాన్ని మాత్రం రష్యా (Russia) హోంశాఖ తమ డేటాబేస్‌లో పేర్కొనలేదు. కేవలం నేరపూరిత కేసుల్లో అతణ్ని పట్టుకోవాలనుకుంటున్నట్లు మాత్రమే వెల్లడించింది. మెటా నుంచి మాత్రం ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, స్టోన్‌ పేరును రష్యా తమ వాంటెడ్‌ లిస్ట్‌ (Russia Wanted List)లో 2022లోనే చేర్చిందని ఆ దేశ స్వతంత్ర మీడియా సంస్థ మీడియాజోనా పేర్కొంది. కానీ, ఇప్పటి వరకు ఈ విషయాన్ని అధికారికంగా బయటపెట్టలేదని తెలిపింది.

2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యన్లపై హింసను ప్రేరేపించే చర్యలకు మెటా (Meta) పాల్పడుతోందని రష్యా ఆరోపించింది. ఈ ఏడాది మార్చి నుంచి ఆ దేశ ఫెడరల్‌ ఇన్వెస్టిగేటివ్‌ కమిటీ.. మెటాపై దర్యాప్తు ప్రారంభించింది. ఉక్రెయిన్‌లోకి రష్యా బలగాలు ప్రవేశించిన తరుణంలో మెటా పాలసీలో స్టోన్‌ కొన్ని మార్పులు చేశారు. తమ నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్నప్పటికీ.. కొంత కఠినమైన కంటెంట్‌ను అనుమతించాలని నిర్ణయించారు. అయితే, రష్యా సామాన్య పౌరులపై హింసను ప్రేరేపించే కంటెంట్‌ను మాత్రం నిషేధిస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు స్టోన్‌పై ఓ రష్యా కోర్టు అరెస్ట్ వారెంట్‌ కూడా జారీ చేసినట్లు మీడియాజోనా తెలిపింది. తీవ్రవాదాన్ని ప్రోత్సహించిన కారణాలు చెబుతూ కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని మాత్రం మీడియాజోనా స్పష్టంగా చెప్పలేదు.

ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యకు ముందు వరకు రష్యా యువతలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌కు మంచి ఆదరణ ఉండేది. కానీ, స్వతంత్ర మీడియా, విమర్శనాత్మక ప్రసంగాలపై ఆంక్షల్లో భాగంగా వీటిని నిషేధించారు. కేవలం వీపీఎన్‌ ద్వారా మాత్రమే వీటిని యాక్సెస్‌ చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ రష్యాలోకి ప్రవేశించకుండా 2022 ఏప్రిల్‌ నుంచి రష్యా నిషేధం విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని