Russia: భారత చమురు మార్కెట్‌లో రష్యా హవా..

ప్రపంచంలో అతిపెద్దదైన చమురు దిగుమతిదారుల్లో ఒకటైన భారత్‌ మార్కెట్‌ కోసం రష్యా, సౌదీ అరేబియాలో తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన నాటి నుంచి భారత్‌ దిగుమతి వాటాల్లో రష్యా

Updated : 05 Aug 2022 21:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలో అతిపెద్దదైన చమురు దిగుమతిదారుల్లో ఒకటైన భారత్‌ మార్కెట్‌ కోసం రష్యా, సౌదీ అరేబియాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన నాటి నుంచి భారత్‌ దిగుమతి వాటాల్లో రష్యా చమురు స్థానం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మాస్కో నుంచి ఆకర్షణీయమైన ధరకు చమురు లభిస్తుండటంతో భారత్‌ ఆ దిశగా మొగ్గు చూపుతోంది.

ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు రష్యా నుంచి సౌదీ కంటే డిస్కౌంట్‌ ధరకు చమురు లభించింది. మే నెలలో ఈ డిస్కౌంట్‌ పీపాకు 19 డాలర్ల వరకు ఉంది. ఈ నేపథ్యంలో రష్యా జూన్‌ నాటికి భారత్‌కు రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారు స్థానాన్ని దక్కించుకొంది. అంతకు ముందు వరకు ఈ స్థానం సౌదీ అరేబియాది. భారత్‌కు అత్యధిక చమురు ఇరాక్‌ నుంచి దిగుమతి అవుతోంది.

రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడంతో.. ఆ దేశం నుంచి చమురు కొనేందుకు చాలా దేశాలు వెనుకంజ వేశాయి. భారత్‌, చైనాలు మాత్రం గతంలో కంటే అధికంగా చమురు దిగుమతి చేసుకొన్నాయి. దక్షిణాసియాలోని దేశాలు 85 శాతం చమురు దిగుమతులపై ఆధారపడతున్నాయి. ఈ నేపథ్యంలో చౌక ధరకు లభించే చమురు కొంత ఆర్థిక ఉపశమనం కల్పించడంతోపాటు ద్రవ్యోల్బణానికి కళ్లెం వెస్తుంది.

ఈ ఏడాది చమురు ధరలు గణనీయంగా పెరగడంతో రెండో త్రైమాసికంలో భారత్‌ ఇంధన బిల్లు 47.5 బిలియన్‌ డాలర్లకు చేరింది. గతేడాది ఇదే సీజన్‌లో 25.1 బిలియన్‌ డాలర్లుగానే ఉంది. కాకపోతే అప్పట్లో ధరలు, దిగమతులు కూడా తక్కువగానే ఉన్నాయి. ఇటీవల కాలంలో కూడా ఆర్థిక మందగమనంపై అనుమానాలు చమురు ధరలకు కొంత కళ్లెం వేసి దిగుమతిదారులకు ఊరటనిచ్చాయి. భారత రిఫైనరీలు కూడా చౌకగా వచ్చే రష్యా చమురును రెండుచేతులా అందుకొన్నాయి. మరోవైపు భారత్‌ వైపు నుంచి దిగమతులు తగ్గడంతో సౌదీలో మిగులు క్రూడ్‌ ఐరోపా దేశాలకు మళ్లుతోంది. ఇక జూన్‌ నాటికి రష్యా, సౌదీ చమురు ధరల్లో కొంత తేడాలు ఉన్నాయి. జూన్‌లో రష్యా చమురు సగటు పీపా ధర 13 డాలర్ల చౌకగా 102 డాలర్ల వరకు ఉంది. ఇక ఇరాక్‌ ఇప్పటికీ అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా నిలిచింది. మార్చి నుంచి రష్యా చమురు దిగుమతులు 10 రెట్లు పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని