IPO: ఐపీఓ అంటే అంత ఈజీ కాదు.. కఠినంగా వ్యవహరిస్తున్న సెబీ!

IPO: ఇటీవల కంపెనీల ఆరు ఐపీఓ ప్రాథమిక పత్రాలను ఐపీఓ తిప్పి పంపింది.

Published : 20 Mar 2023 00:34 IST

దిల్లీ: పేటీఎం ఐపీఓ (IPO) ఇచ్చిన షాక్‌ తర్వాత మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ పబ్లిక్‌ ఇష్యూలకు ఇచ్చే అనుమతుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇటీవల ఆరు కంపెనీల ఐపీఓ ప్రాథమిక పత్రాలను తిప్పి పంపింది. మరింత అదనపు వివరాలతో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

ఓయో పేరిట ఆతిథ్య సేవలను అందిస్తున్న ఒరావెల్‌ స్టేస్‌ను సైతం సెబీ తిరిగి ప్రాథమిక పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ జాబితాలో గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఫెయిర్‌ఫ్యాక్స్‌ గ్రూప్‌, లావా ఇంటర్నేషనల్‌, పేమేట్‌ ఇండియా, ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, బీవీజీ ఇండియా కూడా ఉన్నాయి. ఈ ఆరు కంపెనీలు 2021 సెప్టెంబరు 2022 మే మధ్య ఐపీఓ ప్రాథమిక పత్రాలను సమర్పించాయి. 2023 జనవరి- మార్చి 10 మధ్య సెబీ వాటిని తిప్పి పంపింది.

ఈ ఆరు కంపెనీలు కలిసి ఐపీఓ (IPO) ద్వారా దాదాపు రూ.12,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2021లో ఐపీఓకి వచ్చిన పలు బడా కంపెనీలు మదుపర్లకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ నేపథ్యంలో సెబీ అప్రమత్తమైంది. అనుమతి ఇచ్చే విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. 2022లో ఒక ఐపీఓకు అనుమతి ఇచ్చేందుకు సగటున కనీసం 115 రోజులు తీసుకుంది. పేటీఎం, జొమాటో, నైకా వంటి కంపెనీలు మదుపర్ల సంపదను భారీ ఎత్తున ఆవిరి చేసిన విషయం తెలిసిందే. సెబీ తీసుకుంటున్న చర్యల్ని పరిశ్రమ వర్గాలు స్వాగతిస్తున్నాయి. ప్రైమరీ మార్కెట్‌ విషయంలో నియంత్రణా సంస్థ కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని