Stock Market: రెండురోజుల లాభాలకు బ్రేక్‌.. ఆద్యంతం 82 ఎగువనే రూపాయి!

అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, రూపాయి బలహీనత, ఫెడ్‌ రేట్ల పెంపు భయాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది.

Updated : 07 Oct 2022 16:17 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో దాదాపు 370 పాయింట్ల వరకు కుంగింది. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో భారీగా పుంజుకుంది. కానీ, పూర్తిస్థాయి లాభాల్లోకి మాత్రం రాలేకపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. మరోవైపు నేడు అమెరికాలో సెప్టెంబరు నెల ఉద్యోగ నియామక గణాంకాలు వెలువడనున్నాయి. ఈ డేటా నిరాశపరిస్తే ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపును మరింత వేగవంతం చేసే అవకాశం ఉందన్న అంచనాలు మదుపర్లను అప్రమత్తం చేశాయి. గత రెండు రోజుల లాభాల నేపథ్యంలో మదుపర్లు కీలక కౌంటర్లలో లాభాల స్వీకరణ సైతం మార్కెట్లపై ప్రభావం చూపింది. మరోవైపు రూపాయి బలహీనత కూడా సెంటిమెంటును దెబ్బతీసింది.

సెన్సెక్స్‌ ఉదయం 58,092.56 వద్ద నష్టాలతో ప్రారంభమై ఇంట్రాడేలో 57,851.15 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు 30.81 పాయింట్ల నష్టంతో 58,191.29 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 17,287.20 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టి.. 17,216.95 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 17.15 పాయింట్లు నష్టపోయి 17,314.65 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో 12 షేర్లు లాభపడ్డాయి. టైటన్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌ అత్యధికంగా లాభపడిన షేర్లలో ఉన్నాయి. ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టీసీఎస్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, ఐటీసీ, విప్రో నష్టపోయాయి.

82ని దిగిరాని రూపాయి..

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.82.32 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 82.42 వద్ద జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే ఈరోజు దాదాపు 39 పైసలు కుంగింది. అమెరికాలో ఉద్యోగ గణాంకాలు నిరాశపరిస్తే.. రేట్ల పెంపును ఫెడ్‌ మరింత వేగవంతం చేసే అవకాశం ఉందన్న అంచనాలతో డాలర్‌ మరింత బలపడింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 94 డాలర్లకు చేరడం కూడా మన కరెన్సీ సెంటిమెంటును దెబ్బతీసింది.

మార్కెట్‌లోని ఇతర సంగతులు..

  • వారోక్‌ ఇంజినీరింగ్‌ షేరు ఇంట్రాడేలో 9 శాతం నష్టాన్ని చవిచూసింది. ఐరోపా, అమెరికా ఫోర్‌ వీలర్‌ లైటింగ్‌ వ్యాపారం నుంచి పూర్తిగా నిష్క్రమించినట్లు కంపెనీ తెలపడమే ఇందుకు కారణం. చివరకు షేరు ధర 7.85 శాతం తగ్గి రూ.314.65 వద్ద స్థిరపడింది.
  • సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో తమ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 18 శాతం వృద్ధి చెందినట్లు టైటన్‌ ప్రకటించింది. దీంతో కంపెనీ షేరు ఇంట్రాడేలో 6 శాతానికి పైగా లాభపడింది. చివరకు 5.30 శాతం లాభపడి రూ.2,730.20 వద్ద స్థిరపడింది.
  • రెండో త్రైమాసికంలో మెరుగైన ఆదాయ వృద్ధి, రానున్న రోజుల్లో భారీ డిమాండ్‌ అంచనాల నేపథ్యంలో ఆభరణాల విక్రయ సంస్థల షేర్లు ఈరోజు రాణించాయి. కల్యాణ్‌ జువెలర్స్ ఇంట్రాడేలో నాలుగు శాతం లాభపడి రూ.101.65 వద్ద, పీసీ జువెలర్స్‌ సైతం దాదాపు 4 శాతం పెరిగి రూ.97.50 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి.
  • విద్యుత్‌ వాహన తయారీ సంస్థ రివోల్ట్‌లో రతన్‌ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌ 100 శాతం వాటాలను సొంతం చేసుకుంది. దీంతో రతన్‌ ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌ షేరు ఇంట్రాడేలో 10 శాతం పెరిగింది. చివరకు 8.03 శాతం లాభపడి రూ.53.80 వద్ద స్థిరపడింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని