Stock Market Closing Bell: 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్‌.. ₹2.85 లక్షల కోట్లు ఆవిరి!

Stock Market Closing Bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి...

Published : 19 Aug 2022 16:03 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లోని వరుస 8 రోజుల లాభాల జోరుకు శుక్రవారం బ్రేక్‌ పడింది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీనతలు దేశీయ సూచీలపై ప్రభావం చూపాయి. జూన్‌లో నమోదైన కనిష్ఠాల నుంచి నిఫ్టీ ఇప్పటి వరకు 18 శాతం ఎగబాకింది. ఈ నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరించారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వివిధ దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బలాన్ని సూచించే డాలర్‌ ఇండెక్స్‌ ఒక నెల గరిష్ఠానికి చేరడం మదుపర్లను ఆందోళనలోకి నెట్టింది. మరోవైపు ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్ల పెంపు వల్ల దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ.. రేట్ల పెంపు ఇంకా కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలూ మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. మరోవైపు డీజిల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతులపై తాజాగా పెంచిన ఎగుమతి సుంకం కూడా సూచీలను ప్రభావితం చేసింది.       

నిఫ్టీ ఉదయం 17,966.55 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,710.75 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 198.05 పాయింట్ల భారీ నష్టంతో 17,758 వద్ద స్థిరపడింది. 60,351.23 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 900 పాయింట్లకు పైగా నష్టపోయి 59,474.57 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్‌ 651.85 పాయింట్ల నష్టంతో 59,646.15 వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్‌ 60 వేల కీలక మార్కును మళ్లీ కోల్పోయింది.

దీంతో ఈరోజు బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ రూ.2.85 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.79 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, మారుతీ, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, రిలయన్స్‌, ఎంఅండ్‌ఎం, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

భారత్‌లో డోమినోస్‌ పిజ్జా మాస్టర్‌ ఫ్రాంచైజీ జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ విస్తరణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. అయినా.. సంస్థ షేర్లు ఈరోజు 3.25 శాతం కుంగి రూ.600 వద్ద స్థిరపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని