Stock Market: లాభాల్లో మార్కెట్‌ సూచీలు.. 60,000 ఎగువకు సెన్సెక్స్‌

Stock Market: సెన్సెక్స్‌ శుక్రవారం 60,000 కీలక మైలురాయిని మళ్లీ అందుకుంది. నిఫ్టీ 50 పాయింట్లకు పైగా లాభంలో ఉంది.

Published : 03 Feb 2023 09:48 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:37 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 279 పాయింట్ల లాభంతో 60,223 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 53 పాయింట్లు లాభపడి 17,656 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.15 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. అక్కడి టెక్‌ స్టాక్స్‌లో వచ్చిన ర్యాలీ సూచీలను ముందుండి నడిపించింది. డిసెంబరు త్రైమాసికంలో మెటా ఫలితాలు అంచనాలను మించాయి. దీంతో కంపెనీ షేరు ఏకంగా 23 శాతం లాభపడింది. 2013 తర్వాత ఈ స్టాక్‌కు ఇదే ఒకరోజులో అత్యధిక పెరుగుదల. ఆసియా- పసిఫిక్‌ సూచీలు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. విదేశీ మదుపర్లు గురువారం రూ. 3,065.35 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు రూ. 2,371.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర 82.33 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఈరోజు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: ఎస్‌బీఐ, ఐటీసీ, దివీస్‌, ఇండిగో, మారికో, మెడ్‌ప్లస్‌, పేటీఎం, టాటా పవర్‌, థైరోకేర్‌, టీవీ టుడే, ఇమామి, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మణప్పురం ఫైనాన్స్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌, అబాన్‌ ఆఫ్‌షోర్‌

గమనించాల్సిన స్టాక్స్‌..

అదానీ గ్రూప్‌ షేర్లు : అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్‌, అంబుజా సిమెంట్‌ షేర్లను ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి తెచ్చినట్లు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. దీని ప్రకారం.. ఈ షేర్లలో ఇంట్రాడేలో ట్రేడ్‌ చేయాలంటే ట్రేడర్లకు ముందస్తుగా 100 శాతం మార్జిన్‌ అవసరం. ఇందువల్ల కొంత మేర షార్ట్‌ సెల్లింగ్‌కు అడ్డుకట్ట పడుతుంది.

హెచ్‌డీఎఫ్‌సీ: డిసెంబరు త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ రూ.7,077.91 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదేకాల లాభంతో పోలిస్తే ఇది 14.74 శాతం ఎక్కువ. అనుబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం కాబోతున్న హెచ్‌డీఎఫ్‌సీ లాభం స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.3,260.69 కోట్ల నుంచి రూ.3,690.80 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 13%  పెరిగి రూ.4,840 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 3.5 శాతానికి చేరింది.

టైటన్‌: టాటా గ్రూప్‌ సంస్థ టైటన్‌ కంపెనీ డిసెంబరు త్రైమాసికంలో రూ.913 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.2021-22 ఇదేకాల లాభం రూ.1,012 కోట్లతో పోలిస్తే ఇది 9.78 శాతం తక్కువ. ఏకీకృత మొత్తం ఆదాయం రూ.10,094 కోట్ల నుంచి రూ.11,698 కోట్లకు పెరిగింది.

డాబర్‌ ఇండియా: ఎఫ్‌ఎంసీజీ సంస్థ డాబర్‌ ఇండియా డిసెంబరు త్రైమాసికంలో రూ.476.55 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.504.35 కోట్లతో పోలిస్తే ఇది 5.51% తక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.2,941.75 కోట్ల నుంచి 3.44 శాతం పెరిగి రూ.3,043.17 కోట్లకు చేరింది.

కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌: ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తుల సంస్థ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ డిసెంబరు త్రైమాసికానికి స్టాండలోన్‌ ఖాతాల ప్రకారం రూ.8,350 కోట్ల ఆదాయాన్ని, రూ.539 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదే కాల ఆదాయం రూ.5,101 కోట్లు, నికరలాభం రూ.379 కోట్లు మాత్రమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు