Bill Gates: ఏఐతో వారానికి 3 పనిదినాలు సాధ్యమే: బిల్‌ గేట్స్‌

మనుషులకు కృత్రిమ మేధ సాంకేతిక ప్రత్యామ్నాయం కాబోదని మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ అభిప్రాయపడ్డారు. ఏఐతో ఉద్యోగాల కోతలు ఉండవన్నారు. 

Updated : 24 Nov 2023 06:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనుషులకు కృత్రిమ మేధ (artificial intelligence) ప్రత్యామ్నాయం కాబోదని మైక్రోసాఫ్ట్‌ (Microsoft) అధినేత బిల్‌గేట్స్‌ (Bill Gates) అభిప్రాయపడ్డారు. ఏఐతో ఉద్యోగాల కోతలు ఉండవన్నారు. అయితే, పనితీరులో మాత్రం శాశ్వత మార్పులు చోటుచేసుకుంటాయని, వారానికి మూడు పనిదినాలు సాధ్యమేనని చెప్పారు. దక్షిణాఫ్రికాకు చెందిన కమెడియన్‌, రచయిత ట్రేవొర్‌ నోహా నిర్వహించే ‘వాట్‌ నౌ’ పాడ్‌కాస్ట్‌లో ఆయన పాల్గొని ఏఐతో ఉన్న లాభానష్టాల గురించి చర్చించారు.

‘‘కొన్నాళ్లకు ఏఐతో మనుషులు కష్టపడాల్సిన అవసరం ఉండని దశకి చేరుకుంటాం. యంత్రాలే ఆహారం, ఇతర పనులు చేసిపెడతాయి. ఈ క్రమంలో వారానికి 3 రోజులే పనిచేసే సమాజాన్ని చూడొచ్చు. అది సాధ్యమే. సంస్థలు, ఉద్యోగులు దీన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది’’ అని బిల్‌గేట్స్‌ వ్యాఖ్యానించారు.

అంతకుముందు కూడా బిల్‌గేట్స్‌ ఏఐ గురించి పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో నూతన టెక్నాలజీ రావడం కొత్తేమీ కాదని, పారిశ్రామిక విప్లవం చూపినంత ప్రభావం.. కృత్రిమ మేధ సాంకేతికత చూపించకపోవచ్చని చెప్పారు. అయితే కంప్యూటర్లు ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయో ఏఐతో అంతే మార్పు ఉండొచ్చన్నారు. దీని వల్ల కలిగే నష్టాల గురించి కూడా బిల్‌గేట్స్‌ ప్రస్తావించారు. ‘‘ఏఐతో డీప్‌ఫేక్‌, తప్పుడు సమాచారం, భద్రత లోపాలు, తరచూ జాబ్‌ మార్కెట్‌లో మార్పులు తలెత్తుతాయి. విద్యపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఏఐ ప్రమాదకరమని కొందరు.. మంచి పరిణామమని మరికొందరు అంటున్నారు. నిజానికి ఏఐతో సమస్యలున్న మాట వాస్తవమే అయినా వాటిని మనం ఎదుర్కొగలం’’ అని బిల్‌గేట్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని