Adani Group: ‘అదానీ’తో ‘టోటల్‌’ జాయింట్‌ వెంచర్‌.. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అతిపెద్ద ఒప్పందం!

Adani Group: కొత్త జాయింట్‌ వెంచర్‌ ఆధ్వర్యంలో 1,050 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన విద్యుదుత్పత్తి కార్యకలాపాలు చోటుచేసుకోనున్నాయి.

Published : 20 Sep 2023 18:35 IST

దిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ ఎనర్జీస్‌ ఎస్‌ఈతో కలిసి అదానీ గ్రూప్‌ (Adani Group) ఓ కొత్త జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయనుంది. దీంట్లో ఇరు సంస్థలకు 50: 50 భాగస్వామ్యం ఉండనుంది. ఈ కొత్త సంస్థ స్వచ్ఛ ఇంధన వ్యాపార కార్యకలాపాలు నిర్వహించనుంది. దీనికోసం టోటల్‌ ఎనర్జీస్‌ 300 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తర్వాత అదానీ గ్రూప్‌నకు ఇదే అతిపెద్ద ఒప్పందం. అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ఈ జాయింట్‌ వెంచర్‌లో భాగం కానుంది.

ఈ కొత్త జాయింట్‌ వెంచర్‌ ఆధ్వర్యంలో 1,050 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన విద్యుదుత్పత్తి కార్యకలాపాలు చోటుచేసుకోనున్నాయి. దీంట్లో 300 మెగావాట్ల సామర్థ్యం ఇప్పటికే వ్యవస్థీకృతం కాగా.. మరో 750 మెగావాట్ల విద్యుదుత్పత్తికి కావాల్సిన మౌలిక సదుపాయాలు వివిధ దశల్లో ఉన్నాయి. స్వచ్ఛ ఇంధన రంగంలో పోర్ట్‌ఫోలియోను విస్తరించుకోవడంలో భాగంగానే ‘టోటల్‌’ ఈ పెట్టుబడులను పెడుతోంది. ఇప్పటికే ఈ కంపెనీకి అదానీ గ్రీన్‌ ఎనర్జీలో 19.7 శాతం వాటాలున్నాయి. 2019లో అదానీ గ్యాస్‌లో 600 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో 37.4 శాతం వాటాను సొంతం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని