Wipro: వారంలో 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే: విప్రో

Wipro: క్రమంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి పలికేందుకు విప్రో సిద్ధమవుతోంది. అందులో భాగంగా వారంలో కొన్ని రోజులు ఆఫీసులో పనిచేయడాన్ని తప్పనిసరి చేస్తూ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.

Updated : 07 Nov 2023 13:40 IST

బెంగళూరు: కరోనా మహమ్మారి భయాలు పూర్తిగా తొలగిపోయిన నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇంటి నుంచి పనిచేస్తున్న (Work from Home) వారు ఇక నుంచి ఆఫీసుకి రావడాన్ని తప్పనిసరి చేస్తున్నాయి. మధ్యేమార్గంగా కొన్ని రోజులు ఇంటి దగ్గర, మరికొన్ని రోజులు ఆఫీసుకు వచ్చే హైబ్రిడ్‌ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విధానంలో ఉద్యోగులు ఆఫీసుకు రావడం వారి ఇష్టానికి వదిలిపెట్టారు. కానీ, ఇప్పుడు దానికీ స్వస్తి పలికేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. తాజాగా విప్రో (Wipro) ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్‌ ద్వారా సమాచారం అందించింది. ఇప్పటికే ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ ఆ దిశగా చర్యలు తీసుకున్నాయి.

నవంబర్‌ 15 నుంచి ఉద్యోగులంతా ఆఫీసుకు రావాలని విప్రో (Wipro) తాజాగా ఆదేశించింది. వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసులోనే పనిచేయడాన్ని తప్పనిసరి చేసింది. వీటిని ఉల్లంఘించిన వారిపై కంపెనీ పాలసీ ప్రకారం క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆఫీసుకు నేరుగా వచ్చి సహోద్యోగులతో కలిసి పనిచేస్తేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని భావించే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది. బృంద స్ఫూర్తి, సహచరులతో ప్రత్యక్ష చర్చల వంటివి ఉత్పాదకతను పెంచుతాయని అభిప్రాయపడింది.

టీసీఎస్‌ ఇప్పటికే వారంలో ఐదు రోజులు ఆఫీసు నుంచి పనిచేయడాన్ని తప్పనిసరి చేసింది. ఇన్ఫోసిస్‌ సైతం నవంబర్‌ 20 నుంచి వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాలని వారి ఉద్యోగులకు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పలు ఐటీ కంపెనీల ఆదాయాలు, లాభాల్లో క్షీణత నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమ్‌ వర్క్‌ వల్ల ఉత్పాదకత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం కంపెనీల నుంచి వ్యక్తమవుతోంది.

సెప్టెంబరు త్రైమాసికంలో విప్రో (Wipro) రూ.2,667.30 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.2,649.10 కోట్లతో పోలిస్తే పెద్దగా మార్పులేదు. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.22,539.70 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి రూ.22,515.90 కోట్లకు పరిమితమైంది. ఐటీ సేవల ఆదాయం రూ.22,520.50 కోట్ల నుంచి రూ.22,395.80 కోట్లకు తగ్గింది. మిగతా విభాగాల్లో కంపెనీ వ్యాపారాదాయం స్వల్పంగా పెరిగింది. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా, తయారీ లాంటి కీలక విభాగాల నుంచి కూడా విప్రోకు వ్యాపారం తగ్గింది. అంతర్జాతీయ ప్రతికూలతల దృష్ట్యా ప్రస్తుత త్రైమాసికంలో (అక్టోబరు-డిసెంబరు) ఆదాయం 3.5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు