Artificial Intelligence: ప్రపంచంలో తొలి ‘ఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్‌’ బ్రిటన్‌లో..

బ్రిటన్‌లో ప్రపంచంలోనే తొలి ‘కృత్రిమ మేధ భద్రత సంస్థ’ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి రిషి సునాక్‌ ప్రకటించారు.

Updated : 26 Oct 2023 19:47 IST

లండన్‌: కృత్రిమ మేధ (Artificial Intelligence) సాంకేతికతపై ఆందోళనలూ వ్యక్తం అవుతోన్న ప్రస్తుత తరుణంలో.. బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) కీలక ప్రకటన చేశారు. బ్రిటన్‌లో ప్రపంచంలోనే తొలి ‘కృత్రిమ మేధ భద్రత సంస్థ (AI Safety Institute)’ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ‘ఏఐ సేఫ్టీ’కి సంబంధించి ప్రపంచ పరిజ్ఞానాన్ని మెరుగుపరచడంతోపాటు కొత్త కొత్త కృత్రిమ మేధ సాంకేతికతలను అధ్యయనం చేస్తూ.. వాటి లాభనష్టాలను ఈ సంస్థ అన్వేషిస్తుందని తెలిపారు. తొలి ‘అంతర్జాతీయ కృత్రిమ మేధ భద్రత శిఖరాగ్ర సదస్సు’కు బ్రిటన్‌ సిద్ధమైన వేళ రిషి సునాక్‌ ఈ ప్రకటన చేశారు.

‘విద్యుత్‌, పారిశ్రామిక విప్లవం, ఇంటర్నెట్‌ మాదిరిగా.. ‘ఏఐ’ వంటి సాంకేతికతలు కూడా విస్తృతమైన మార్పులను తీసుకొస్తాయి. ఈ టెక్నాలజీలతో అనేక సానుకూల అంశాలతోపాటు సూపర్‌ ఇంటెలిజెన్స్‌ వంటి భయాలు, ప్రమాదాలూ పొంచి ఉన్నాయి. రసాయన, జీవాయుధాల తయారీ, సైబర్‌ దాడులు వంటి పనులను ఇది సులభతరం చేయగలదు. విధ్వంసం, భయాలను వ్యాప్తి చేసేందుకు ఉగ్రసంస్థలు ‘ఏఐ’ని ఉపయోగించే ప్రమాదం ఉంది. వీటిని దీటుగా ఎదుర్కోవాలి. కృత్రిమ మేధతో ముప్పు లేకపోలేదని పెద్ద పెద్ద డెవలపర్లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నాయకులు వాటిని తీవ్రంగా పరిగణించి, తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని రిషి సునాక్‌ వ్యాఖ్యానించారు.

కృత్రిమ మేధ.. ఇప్పుడిదే సర్వాంతర్యామి

‘కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్‌.. కృత్రిమ మేధ విషయంలో ప్రపంచ పరిజ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది. కొత్త రకాల ఏఐలను జాగ్రత్తగా పరిశీలించడంతోపాటు వాటిని పరీక్షించి, మూల్యాంకనం చేస్తుంది. తద్వారా.. వాటి సామర్థ్యాలు ఏంటో మనకు అర్థమవుతాయి. సమాజానికి హాని కలిగించే తప్పుడు సమాచారం వంటి సమస్యలు మొదలు తీవ్రమైన పరిణామాల వరకు ఏఐతో పొంచి ఉన్న ముప్పును అన్వేషిస్తుంది’ అని రిషి సునాక్‌ వివరించారు. సూపర్ కంప్యూటర్‌ అభివృద్ధిలో దాదాపు రూ.10 వేల కోట్లు, క్వాంటం కంప్యూటర్‌లలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. ఇదిలా ఉండగా.. నవంబరు 1, 2వ తేదీల్లో నిర్వహించనున్న ‘గ్లోబల్‌ ఏఐ సేఫ్టీ సమ్మిట్‌’లో పాల్గొనేందుకు చైనా సహా ఆయా దేశాలను బ్రిటన్‌ ఆహ్వానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని