logo

దస్త్రాల్లోనే ఇంకుడు గుంతలు

ఏటా పురపాలకశాఖ ఇంకుడు గుంతల నిర్మాణానికి లక్ష్యాన్ని విధిస్తున్నా జిల్లాలో ఆశించిన స్థాయిలో జరగడం లేదు. జల్‌శక్తి అభియాన్‌ పేరుతో ఇంకుడు గుంతలు నిర్మించేందుకు చర్యలు ప్రారంభించాల్సి ఉండగా అడుగులు పడటం లేదు.

Published : 04 Jun 2023 03:07 IST

చెన్నూరు, న్యూస్‌టుడే : ఏటా పురపాలకశాఖ ఇంకుడు గుంతల నిర్మాణానికి లక్ష్యాన్ని విధిస్తున్నా జిల్లాలో ఆశించిన స్థాయిలో జరగడం లేదు. జల్‌శక్తి అభియాన్‌ పేరుతో ఇంకుడు గుంతలు నిర్మించేందుకు చర్యలు ప్రారంభించాల్సి ఉండగా అడుగులు పడటం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేస్తుండగా మూడేళ్లుగా ఆ దిశగా కార్యాచరణ చేయడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు నిర్ణీత లక్ష్యాన్ని సాధించాలంటూ పురపాలకశాఖ అన్ని బల్దియాలకు ఆదేశాలిచ్చింది. వాటి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పుర కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. నేటికీ పట్టణాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాల ఊసే కనిపించడం లేదు.

పురాల్లో ఇంటి నిర్మాణ సమయంలో ఇంకుడు గుంత నిర్మాణం చేస్తామని విధిగా పత్రంలో పేర్కొంటేనే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ అమలులోనే చిత్తశుద్ధి కరవవుతోంది. నిబంధనల ప్రకారం ఇంకుడుగుంత నిర్మాణానికి చదరపు గజానికి రూ.10 చొప్పున కనీసం రూ.2 వేలు చెల్లిస్తేనే అనుమతి వస్తోంది. నిర్మించిన ఇంకుడుగుంతను పట్టణ ప్రణాళిక అధికారులు పరిశీలించి నిర్మాణం సవ్యంగా ఉంటే రూ.2 వేలు తిరిగి యజమానికి చెల్లించే వెసులుబాటు ఉంది. కానీ ఎక్కడా అలా జరగడం లేదు. నివాసిత ప్రాంతాలు, ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, భవనాలు, చేతిపంపులు, ట్యాంకులు, ఫిల్టర్‌బెడ్లు ఉన్నచోట వీటిని నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

మూడు రకాలుగా..

కేంద్రం ప్రభుత్వం ప్రదేశాలను బట్టి మూడు రకాలుగా ఇండు గుంతలు నిర్మించేలా ప్రణాళికలు రచించారు. కిచెన్‌ సోక్‌పిట్‌(ఇంట్లో వంటగది నీళ్లు మళ్లించేందుకు) దీని విలువ రూ.5 వేలు, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టు సోక్‌పిట్‌(భవనాల పైనుంచి వచ్చే వర్షపు నీరు నిల్వ చేయడం) దీని విలువ రూ.12 వేలు,  ప్రభుత్వ కార్యాలయాల్లో రూ.26 వేలతో మెగా సోక్‌పిట్‌ నిర్మించాలని నిర్ణయించారు.

చేతిపంపువద్ద ఇంకుడుగుంత లేకపోవడంతో అవసరాలకు వినియోగించిన అనంతరం నీరంతా వృథాగా పోతోంది. దీని చుట్టూ అపరిశుభ్రత నెలకొని నీరు కలుషితమవుతోంది. ఇలాంటి చేతి పంపులు జిల్లాలో 600 వరకు ఉన్నాయి. వీటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇళ్ల నుంచి వెలువడున్న వృథా నీరు ఇది. రహదారులు, గృహాల పక్కన చేరకుండా ఉండేలా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అపరిశుభ్రత నెలకొనడంతోపాటు భూగర్భ జలమట్టం తగ్గిపోతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని