logo

పెన్‌గంగా.. ఇసుకదందా

మండలవాసులకు వరప్రదాయినిగా ఉన్న పెన్‌గంగా నదిలో ఇసుకదొంగలు పడ్డారు. పారే నీటిని ఆపిమరీ యంత్రాలతో ఇసుకను తోడి అక్రమ రవాణా చేస్తున్నారు.

Published : 29 Mar 2024 05:53 IST

యంత్రంతో నీటి నుంచి ఇసుక తీస్తున్నారిలా..

భీంపూర్‌, న్యూస్‌టుడే: మండలవాసులకు వరప్రదాయినిగా ఉన్న పెన్‌గంగా నదిలో ఇసుకదొంగలు పడ్డారు. పారే నీటిని ఆపిమరీ యంత్రాలతో ఇసుకను తోడి అక్రమ రవాణా చేస్తున్నారు. జిల్లాలోకి నది ప్రవేశించే చోటు గుబిడి మొదలుకుని అంతర్గాం, వడూర్‌, తాంసి-కె పరీవాహక ప్రదేశాల్లో రాత్రిబవళ్లు ఇసుకను విచ్చలవిడిగా తోడుతున్నారు. ఆదిలాబాద్‌, తాంసి, తలమడుగు, ఇచ్చోడ, నేరడిగొండ, గుడిహత్నూర్‌, మావల నుంచి ట్రాక్టర్లు, టిప్పర్‌లతో వచ్చి అక్రమార్కులు ఇసుకను తీసుకెళ్తున్నారు. గ్రామాభివృద్ధి పేరిట పలుకుబడి కలిగిన కొందరు జట్టుగా ఏర్పడి అనధికారిక వేలం పాటలతో ఇసుక దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మండలంలోని ఆయా ప్రాంతాల నుంచి రోజుకి ఏకంగా 100 వాహనాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒక్కో అధికారికి నెలకు రూ.10-20 వేలు ముట్టజెపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ అధికారికి నెలవారీ డబ్బులు అందకపోతే ట్రాక్టర్లను ఆపి.. తన వాటా ఇచ్చాకే వాటిని వదిలిపెట్టడం వీటిని బలాన్ని చేకూరుస్తుంది. ట్రాక్టరు యజమాని ఒక్కో ట్రిప్పునకు రాయల్టీ, రవాణా ఖర్చులుపోనూ నెలకు రూ.50 వేలపైనే సంపాదిస్తుండగా.. రాయల్టీ, ఇసుక రవాణాతో వేలం దక్కించుకున్న వారు నెలకు రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అటు గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోగా.. ఇటు ఇసుక తవ్వకాలతో జీవనది కాస్త ఎడారిని తలపిస్తోంది.

తాంసి-కెలో ప్రత్యేకంగా రోడ్డు ఏర్పాటు చేసుకున్నారిలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు