logo

విద్యార్థులను పరీక్షలకు అనుమతించలేదని ఆందోళన

దండేపల్లి మండలం కన్నెపల్లిలోని ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు దీక్ష స్వీకరించడంతో మంగళవారం పరీక్ష రాసేందుకు వారిని ప్రిన్సిపల్‌ అనుమతించలేదు.

Published : 17 Apr 2024 07:03 IST

కన్నెపల్లిలో నాలుగు గంటల పాటు ఉద్రిక్తత

 కన్నెపల్లిలో పాఠశాల ముందు దీక్షాపరులు, విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళన

 దండేపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: దండేపల్లి మండలం కన్నెపల్లిలోని ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు దీక్ష స్వీకరించడంతో మంగళవారం పరీక్ష రాసేందుకు వారిని ప్రిన్సిపల్‌ అనుమతించలేదు. పాఠశాల యూనిఫాంలో వచ్చి పరీక్ష రాయాలని చెప్పారు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు వచ్చి యాజమాన్యాన్ని నిలదీశారు. తమ పాఠశాలలో చదవాలంటే ఎలాంటి దీక్షా తీసుకోవద్దని వారి నుంచి సమాధానం వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న దీక్షాపరులు, విద్యార్థి సంఘాల నాయకులు భారీగా అక్కడికి చేరుకుని ప్రిన్సిపల్‌ను నిలదీశారు. ఆయన నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కోపోద్రిక్తులైన వారు పాఠశాల అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు శాంతించకుండా ప్రిన్సిపల్‌, కరస్పాండెంటుపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. నాలుగు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దఎత్తున దీక్షాపరులు రావడంతో వారిని పోలీసులు అదుపు చేయలేకపోయారు. కన్నెపల్లి ప్రధాన రహదారిపై భైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మంచిర్యాల డీసీపీ అశోక్‌కుమార్‌, ఏసీపీ ప్రసాద్‌, సీఐ నరేందర్‌, ఎంఈఓ రవీందర్‌ వచ్చి వారికి నచ్చజెప్పారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మండల విద్యాధికారి కార్యాలయం నుంచి పాఠశాలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. బుధవారంలోపు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ఆందోళనతో వాయిదా పడిన నాలుగో తరగతి తెలుగు పరీక్షను బుధవారం నిర్వహించనున్నట్లు గూడెం క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌ రమేశ్‌ తెలిపారు. ఈ విషయమై పాఠశాల కరస్పాండెంట్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. క్రమశిక్షణలో భాగంగా పాఠశాల యూనిఫాం ధరించాలని మాత్రమే చెప్పామన్నారు. వారి తల్లిదండ్రులను తీసుకొస్తే మాట్లాడుతామని విద్యార్థులతో చెప్పినట్లు పేర్కొన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశంతో చేయలేదన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని