logo

అక్రమ వెంచర్లు సిద్ధం.. సక్రమానికి యత్నం

అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.

Updated : 19 Apr 2024 06:35 IST

రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులపై ఒత్తిళ్లు..

ఆసిఫాబాద్‌ పె‌ట్రోల్‌బంక్‌ వెనుక ఓ ప్రజాప్రతినిధికి చెందిన అనుమతులు లేని వెంచర్‌

ఈనాడు, ఆసిఫాబాద్‌: అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు. పంట చేన్ల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే మొరాన్ని తెస్తూ హడావుడిగా వెంచర్లలో రోడ్లు వేసేస్తున్నారు. స్థలాలను కొనుగోలు చేసిన వ్యక్తుల రిజిస్ట్రేషన్‌ కోసం సంబంధిత అధికారులపై నేతల సహకారంతో స్థిరాస్తివ్యాపారులు ఒత్తిడి పెంచుతున్నారు. ఎలాగైనా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనే తలంపుతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అనుమతులు లేకుండా పుట్టుగొడుగుల్లా వెలుస్తున్న ఈ వెంచర్లలో.. నిర్వాహకులు పనిలో పనిగా పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాలను సైతం కబ్జా చేసేస్తున్నారు.

వైద్య కళాశాల వెనుక అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు

జిల్లాలో ఎలాంటి దస్త్రాలు లేని వందల ఎకరాల బీడీపీపీ భూములు ఇప్పటికే ప్లాట్లు, భవనాలుగా మారిపోయాయి. చాలా వరకు కబ్జాలకు గురయ్యాయి. 2017లో అప్పటి అధికారులు వీటి స్వాధీనానికి ప్రయత్నించినా.. అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ తరుణంలో ఇబ్బడిముబ్బడిగా వెంచర్లు వెలుస్తున్నాయి. డీటీసీపీ అధికారులు, ఇటు పంచాయతీ, రెవెన్యూ అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో.. భూ మాఫియా ఆటలు సాగుతున్నాయి. కాగజ్‌నగర్‌, ఈజ్‌గాం, వాంకిడి, రెబ్బెన మండలాలతోపాటు ఏజెన్సీ మండలాలైన తిర్యాణి, జైనూర్‌లలో ఈ తరహా వెంచర్లలో అమాయకులకు ప్లాట్లు అంటగడుతున్నారు.

మొరం సైతం..

అనుమతులు లేకుండా ఉన్న వెంచర్లలో అడ్డదిడ్డంగా మొరం రోడ్లు వేయడానికి స్థిరాస్తివ్యాపారులు చిర్రకుంట వెళ్లే మార్గంలో మట్టి క్వారీనే ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు ఇక్కడి నుంచి నాలుగు వరుసల రహదారి కోసం మొరం తరలించారు. ప్రస్తుతం పూర్తిగా వెంచర్ల నిర్వాహకులే ఇక్కడి నుంచి రాత్రి పగలు తేడా మొరం తీసుకెళ్తున్నారు.


మచ్చుకు కొన్ని ..

జిల్లా కేంద్రంలోని గిరిజన ఉద్యానవనానికి ఎదురుగా వెంచర్‌ వేశారు. ఎలాంటి అనుమతులు లేని ఈ ప్రదేశంలో ప్రస్తుతం మట్టిని తెచ్చి చదును చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పెట్రోల్‌బంక్‌ వెనుక వేసిన వెంచర్‌ ఓ ప్రజాప్రతినిధికి చెందినది. ఇక్కడ 22 వరకు ప్లాట్లు ఉండగా.. కొన్నింటిని విక్రయించి, వీటికి రిజిస్ట్రేషన్‌ చేయాలని సంబంధిత అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సర్వే నంబర్‌ 47లో కేవలం మూడు ఎకరాలకు మాత్రమే పట్టా ఉండగా.. ఏకంగా అయిదారు ఎకరాల వరకు చదును చేసి వెంచర్‌ వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతమంతా చెట్లు, పొదలతో నిండి ఉండడంతో అక్రమార్కులు హద్దు లేకుండా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. రెబ్బెన మండలం కేంద్రంలో వట్టివాగు కాలువలను ఆనుకునే వెంచర్లు వేస్తున్నా.. నీటిపారుదలశాఖ అధికారులు అటువైపు చూడడం లేదు.  
ఆసిఫాబాద్‌ మండలంలో గుండి వెళ్లే మార్గంలో సైతం అనేక వెంచర్లు ఉన్నాయి. ఈ ప్రాంతమంతా ఏజెన్సీ పరిధిలోనిది. అయినా ప్లాట్ల అమ్మకాలు, భారీ భవనాల నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అసలు ఇళ్లు లేని ప్రాంతాల్లో (అప్పటికే వెంచర్లు ఉన్న చోట) మొత్తం 94 మందికి అక్రమంగా అప్పటి పంచాయతీ అధికారులు ఇంటి నంబర్లు కేటాయించారు. విచారణ చేసి అవకతవకలను గుర్తించినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆసిఫాబాద్‌ పురపాలికగా  ఏర్పడడంతో.. ఈ విచారణ అటకెక్కినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇంటి నంబర్ల ఆధారంగానే రిజిస్ట్రేషన్‌లు జరగడం వల్ల అక్రమాలు సక్రమంగా పట్టాలు ఎక్కుతున్నాయనేది బహిరంగ రహస్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని