logo

ముఖ్యమంత్రి మాట.. నీటి మూట

అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిపై ఉన్న డంపింగ్‌ యార్డు తరలింపు ఆవశ్యకతను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు 2022 అక్టోబరు 20న అవనిగడ్డ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు.

Published : 24 Apr 2024 04:51 IST

అవనిగడ్డలోని డంపింగ్‌ యార్డుతో జనానికి అవస్థలు
న్యూస్‌టుడే, అవనిగడ్డ గ్రామీణం

అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిపై ఉన్న డంపింగ్‌ యార్డు తరలింపు ఆవశ్యకతను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు 2022 అక్టోబరు 20న అవనిగడ్డ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. స్పందించిన సీఎం డంపింగ్‌ యార్డు తరలింపు కోసం రూ.10 కోట్లు ఇస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఇప్పటికీ నెరవేరక పోవడంతో స్థానిక ప్రజలు ముఖ్యంగా వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు.        

వనిగడ్డలో చెత్త డంపింగ్‌ యార్డు తరలింపు ప్రహసనంగా మారింది. ఎమ్మెల్యే సమక్షంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన సందర్భంలో చెత్త తరలింపు మరో గ్రామమైన అశ్వరావుపాలెం ప్రాంతానికి చేరింది. ఆ గ్రామస్థులు అడ్డుచెప్పడంతో సమస్య మళ్లీ యథాస్థితికి చేరింది. దీంతో అవనిగడ్డ- నాగాయలంక రహదారిపై ప్రయాణించే వారికి ఈ సమస్య తీరని వ్యధగా మారింది.

సమస్యలు ఇలా...

డంపింగ్‌ యార్డులో గుట్టలుగా పేరుకుపోతున్న చెత్తకు నిప్పు పెడుతుండడంతో వాహనదారులకు ముప్పు ఏర్పడుతోంది. రద్దీగా ఉండే రహదారి కావడంతో దట్టమైన పొగ మధ్య ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక, దుర్వాసనకు ముక్కు మూసుకుంటూ ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. డంపింగ్‌ యార్డును తరలిస్తామని చెప్పిన ప్రజాప్రతినిధి మళ్లీ ఆ ఊసే ఎత్తడంలేదని వారు వాపోతున్నారు. యార్డులో వేసిన జంతు కళేబరాల కోసం వీధి కుక్కలు గుంపులుగా చేరి, ఒక్కోసారి ద్విచక్రవాహనాలకు అడ్డుపడుతున్నాయి. పలుమార్లు ద్విచక్ర వాహనాలపై దాడి చేసిన సంఘటనలూ ఉన్నాయి.

ముక్కు మూసుకోవాల్సిందే  

- చిల్లపల్లి సుధాకర్‌, ఎలక్ట్రీషియన్‌, చోడవరం, నాగాయలంక

డంపింగ్‌ యార్డు వద్దకు వచ్చే సరికి ముక్కు మూసుకోవాల్సిందే. దట్టమైన పొగ పేరుకుపోతోంది. దారి కనపడదు, బండి నడపాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఈ సమస్య ఎప్పుటికి తీరుతుందో.


సీఎం మాట నిలబెట్టుకోలేకపోయారు

- కొల్లూరి వెంకటేశ్వరరావు, స్థానికుడు, అవనిగడ్డ

డంపింగ్‌ యార్డు తరలింపు కోసం వేలాది మంది సమక్షంలో నిధులు మంజూరు చేస్తున్నాను అని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సీఎం నుంచి ఎమ్మెల్యే నిధులు తీసుకురాలేకపోయారు. సీఎం మాట నిలబెట్టుకోలేకపోయారు.


కుక్కలు దాడి చేస్తున్నాయి

- మాదివాడ బద్రీనారాయణ, వేకనూరు

ద్విచక్ర వాహనంపై వస్తుంటే కుక్కలు దాడి చేస్తున్నాయి. యార్డులోని జంతు కళేబరాలు ఉండడంతో శునకాలు చేరి, వాహనాలకు అడ్డు పడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని