logo

రోడ్డు ప్రమాద కేసును తప్పుదోవపట్టించిన సీఐ

నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన కేసును సీఐ తప్పు దోవపట్టించారు. న్యాయం చేయాలని ధర్నా చేసిన బాధితులపైనే కేసులు కట్టారు.

Published : 16 Apr 2024 05:54 IST

న్యాయం చేయాలని కోరిన బాధితులపైనే కేసులు

ముఖేశ్‌కుమార్‌ మీనకు ఫిర్యాదు చేస్తున్న బాధిత కుటుంబీకులు, తెదేపా, భాజపా నాయకులు

పుట్టపర్తి, ముదిగుబ్బ, న్యూస్‌టుడే : నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన కేసును సీఐ తప్పు దోవపట్టించారు. న్యాయం చేయాలని ధర్నా చేసిన బాధితులపైనే కేసులు కట్టారు. దీంతో బాధితులు తెదేపా, భాజపా నాయకుల సహకారంతో సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా.. పుట్టపర్తిలోని విద్యాగిరి దగ్గర మార్చి 23న దామోదర్‌నాయుడు (40) ద్విచక్ర వాహనంలో తన పిల్లలకు క్యారేజీ తీసుకెళ్తుండగా ముందు వెళ్తున్న కారు నిర్లక్ష్యంగా నిలిపి డోర్‌ తీయడంతో ప్రమాదానికి గురై మృతి చెందాడు. కారు నడుపుతున్న పేరం శ్రీనివాసరెడ్డి తనకు బాబాయ్‌ అయిన డాక్టర్‌ గోపాల్‌రెడ్డికి జరిగిన విషయం చెప్పారు. గోపాల్‌రెడ్డి వైకాపా నాయకుడు. ముఖ్యమంత్రి జగన్‌కు దగ్గరి వ్యక్తి. గోపాల్‌రెడ్డికి బంధువైన సీఐ కొండారెడ్డితో కలిసి కేసు లేకుండా చేసేందుకు పన్నాగం పన్నారు. మొదట కారును బెంగళూరుకు తరలించారు. మృతదేహాన్ని పుట్టపర్తి జనరల్‌ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లాలని బాధిత కుటుంబీకులకు తెలిపారు. బెంగళూరుకు తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు..

కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం పోయిందని, తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు  పుట్టపర్తి అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట గత నెల 24న ధర్నా చేశారు. న్యాయం చేయాల్సిందిపోయి సీఐ కొండారెడ్డి బాధితులపైనే కేసులు కట్టారు. బాధితులకు న్యాయం చేయమని పెద్దమనుషులు పంచాయితీ వెళ్లగా శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ గోపాల్‌రెడ్డి నానా దుర్భాషలాడారు. ఈ విషయాన్ని బాధితులు తెదేపా, భాజపా నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం విజయవాడలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య ఐదేళ్ల కిందటే చనిపోయింది. ఎనిమిదో తరగతి చదివే కుమార్తె, ఐదో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు