logo

రూ.5 కోసం ప్రయాణికుడి దారుణహత్య

ధర్మవరంలోని రైల్వేస్టేషన్‌ మార్గం కొత్తపేట కూడలి వద్ద ప్రయాణికుడు శ్రీనివాసరెడ్డి (58)తో ఆటో డ్రైవర్‌ లోకేంద్ర, అతని స్నేహితుడు విష్ణు ఆటో ఛార్జి రూ.5ల విషయమై గొడవపడి అతన్ని కర్ర, రాళ్లతో కొట్టి హత్య చేశారు.

Published : 17 Apr 2024 05:37 IST

ఆటో ఛార్జీ బేరంపై గొడవ

 

శ్రీనివాసరెడ్డి (పాత చిత్రం)

ధర్మవరం, న్యూస్‌టుడే : ధర్మవరంలోని రైల్వేస్టేషన్‌ మార్గం కొత్తపేట కూడలి వద్ద ప్రయాణికుడు శ్రీనివాసరెడ్డి (58)తో ఆటో డ్రైవర్‌ లోకేంద్ర, అతని స్నేహితుడు విష్ణు ఆటో ఛార్జి రూ.5ల విషయమై గొడవపడి అతన్ని కర్ర, రాళ్లతో కొట్టి హత్య చేశారు. ధర్మవరం రెండో పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. ధర్మవరంలోని పాతబస్టాండ్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న శ్రీనివాస్‌రెడ్డి మదనపల్లి వెళ్లి తిరుగు ప్రయాణంలో రైలులో ధర్మవరం వచ్చారు. రైల్వేస్టేషన్‌ వెలుపల కొత్తపేట ఆటో స్టాండ్‌ వద్ద నుంచి పట్టణంలోకి వచ్చేందుకు ఆటో డ్రైవర్‌ లోకేంద్ర బేరమాడారు. పట్టణంలోకి వెళ్లేందుకు రూ.15 ఛార్జీ అవుతుందని ఆటో డ్రైవర్‌ చెప్పాడు. రూ.10 ఇస్తానని శ్రీనివాసరెడ్డి ఆటో డ్రైవర్‌తో పేర్కొన్నారు. ఐదు రూపాయల తేడా విషయంలో మాటా మాటా పెరిగి శ్రీనివాసరెడ్డిపై లోకేంద్ర, అతని స్నేహితుడు విష్ణు దాడి చేశారు. కర్ర, రాళ్లతో కొట్టడంతో ఘటనా స్థలంలోనే అతను మృతి చెందాడు. వారు మృతదేహాన్ని రహదారి పక్కన పడేసి వెళ్లారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించి విచారణ చేశారు. ఆటో డ్రైవర్‌, అతని స్నేహితుడు గంజాయి మత్తులో ఉన్నారని స్థానికులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరెడ్డి పట్టణంలో ప్రైవేటు వాహన డ్రైవర్‌గా పనిచేస్తూ వివాదాలకు దూరంగా మంచి వ్యక్తిగా పేరుంది. అతని భార్య శారద ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

 నిందితుల అరెస్ట్‌.. హత్య అనంతరం పారిపోయిన నిందితులను ధర్మవరం కేహెచ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక అరెస్టు చేశామని సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. ఆటో కిరాయి విషయంలో గొడవకు దిగి శ్రీనివాసులరెడ్డిని ఆటో డ్రైవర్‌ లోకేంద్ర, అతని స్నేహితుడు విష్ణు కర్రలు, రాళ్లతో కొట్టి హత్య చేశారని పేర్కొన్నారు. గంటల వ్యవధిలో నిందితులను అరెస్టు చేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని