logo

పోస్టల్‌ బ్యాలెట్‌ భాగోతంపై గందరగోళం

Published : 17 Apr 2024 05:49 IST

ఓటు వినియోగంపై అస్పష్టత

 విద్యాశాఖలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడిది అనంత నగరం నివాసం. ఈయన విధులు మాత్రం శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలో పని చేస్తున్నారు. ఈయనకు అక్కడ ఓపీఓగా విధులు కేటాయించనున్నారు. కానీ ఇప్పటి దాకా ఎవరికీ ఉత్తర్వు ఇవ్వలేదు. ఓటు మాత్రం అనంత నగరంలో ఉంది. అనంత జిల్లాలో ఈ నెల 18లోపు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఫాం-12 దరఖాస్తు చేసుకోవాలి. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు ఎలా.. ఫాం-12 ఎవరికి ఇవ్వాలి?.

  •  జిల్లా వ్యాప్తంగా 2236 మంది బీఎల్వోలు ఉన్నారు. వీరికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం లేదు. పోలింగ్‌ రోజు విధుల్లో ఉంటారు. ఓటు ఎలా వేయాలో అంతుచిక్కని ప్రశ్నలా మారింది. పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పిస్తేనే ఓటు హక్కు వినియోగించుకోడానికి అవకాశం ఉండేది. దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదు.జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: మే 13న జరిగే పోలింగ్‌ నిర్వహణ విధుల్లో ఉండే ఉపాధ్యాయ, ఉద్యోగ ఓట్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఓటు హక్కు వినియోగంపై అస్పష్టత తలెత్తింది. మునుపెన్నడూ లేని విధంగా పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారంలో గందరగోళం ఏర్పడింది. ఈ బాగోతంపై అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌ఓ), నోడల్‌ అధికారుల్లోనే స్పష్టత కొరవడింది. ఫాం-12 ఎక్కడ దాఖలు పరచాలి. పోస్టల్‌ ఓటు ఎప్పుడు, ఎక్కడ వేయాలి.. వంటి వివరాలేవీ తెలియడం లేదు. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల (పీఎస్‌) ప్రిసైడింగ్‌ అధికారి (పీఓ), సహాయ పీఓల నియామకం పూర్తి అయింది. వీరికి ఒక విడత అవగాహన శిక్షణ  కూడా ముగిసింది. మూడు బ్యాచ్‌ల్లో జరిగిన శిక్షణ రోజుల్లోనే సదరు సిబ్బంది ఫాం-12 దాఖలు పరిచారు. అత్యధిక శాతం కల్గిన అదర్‌ పోలింగ్‌ అధికారులుగా (ఓపీఓ) నియమితులైన ఉద్యోగ, ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రెండు రోజుల క్రితమే ఓపీఓలకు పోలింగ్‌ నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉద్యోగ విధులు నిర్వర్తించే చోటుకే వెళ్లి ఉత్తర్వులు అందజేశారు. ఈ ఉత్తర్వుతోపాటే ఫాం-12 దరఖాస్తును కూడా అందించారు.

ఎన్నికలకు 18,851 మంది

అనంత జిల్లావ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో 18,851 మంది ఉన్నారు. వీరిలో పీఓలు 2,552, ఏపీఓలు 2,715 మంది, ఓపీఓలు 9 వేలు మంది దాకా, పోలీసు సిబ్బంది 3,500, ఎన్నికల నిర్వహణ కమిటీల్లో 570, నోడల్‌ అధికారులు 33, సెక్టార్‌ అధికారులుగా 481 మందిని నియమించారు. వీరిలో పీఓ, ఏపీఓ, ఓపీఓలు పోలింగ్‌ రోజున విధుల్లో పాల్గొంటారు. ఈ మూడు కేడర్లే కీలకం. ఎన్నికల విధుల్లో ఉండే వారందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ హక్కు వినియోగించుకోవచ్చు.  కీలక పీఓ, ఏపీఓలు ఇప్పటికే ఫాం-12 శిక్షణ కేంద్రాల్లోనే అందజేశారు. ఓపీఓలకు ఇపుడిపుడే ఉత్తర్వులు అందాయి. వీరు ఫాం-12 ఓటు హక్కు కల్గిన ఆర్వోల కార్యాలయాల్లో ఇవ్వాలని నిర్దేశించారు. మరికొన్ని ప్రాంతాల్లో పనిచేసే చోటే ఇవ్వాలంటూ ఆర్వోలు తిరస్కరిస్తున్నారు. ఈ నెల 15, 16వ తేదీల్లోనే ఫాం-12 ఇవ్వాలని నియామక ఉత్తర్వులోనే పేర్కొన్నారు. గడువు పెంపుపై తగిన సమాచారం క్షేత్ర స్థాయికి వెళ్లలేదు. ఈనెల 29 నాటికి నామపత్రాల ఉపసంహరణ పూర్తి అవుతుంది. మే మొదటి వారంలో పోస్టల్‌ బ్యాలెట్‌ దాఖలుకు ఆర్వోల కేంద్రాల్లోనే ప్రత్యేక పెట్టెలను ఏర్పాటు చేస్తామన్నారు. అపుడే ఓటు హక్కు ఉన్న చోటే వేయాలా. విధులు నిర్వర్తించే చోట వేయాలా? అన్న దానిపై కనీస సమాచారం లేదు.

  •  అనంత నగరంలో నివాసం ఉన్న వందలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు శ్రీసత్యసాయి జిల్లాలో పని చేస్తున్నారు. ఆ జిల్లాలో ఇప్పటికీ ఓపీఓలకు ఉత్తర్వులు ఇవ్వలేదు. ఫాం-12 దాఖలు పరచడానికి ఈ నెల 18న తుదిగడువు. 17న శ్రీరామ నవమి కావడంతో సెలవు ఉంది. ఒక రోజులోనే సదరు ఫారం ఎలా దాఖలు చేస్తారో తెలీదు.
  •  జిల్లా వ్యాప్తంగా 8 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,236 మంది బీఎల్‌ఓలు ఉన్నారు. వీరందరూ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులే. ఓటు హక్కు ఒక చోట, విధులు మరొక చోట ఉన్నాయి. పోలింగ్‌ రోజున విధి నిర్వహణలో ఉండాల్సిందే. వీరికి కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం ఉందా లేదా అన్నది చెప్పడం లేదు.

ప్రతి ఒక్కరికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఫాం-12 దాఖలు పరచడానికి ఈనెల 18 దాకా గడువు పెంచాం. ఓటు హక్కు ఉన్న ప్రాంతాల్లోనే ఆ ఫారాన్ని ఇవ్వవచ్చు. పోస్టల్‌ బ్యాలెట్‌ తేదీలను త్వరలో వెల్లడిస్తాం. ఇతర జిల్లాల్లో పని చేస్తున్న వారికి ఇక్కడ ఓటు హక్కు ఉంటే.. అక్కడే దరఖాస్తు ఇవ్వవచ్చు. ఆ తర్వాత సంబంధిత ఆర్వోలకు వెళ్తాయి.
- ప్రభాకర్‌రావు, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారి/డీపీఓ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని