logo

ఏడు గంటలే.. అందులోనూ కోతలే

నెల రోజులుగా ఏడు గంటలే విద్యుత్తు సరఫరా చేస్తున్నారు.. అదీనూ ఎక్కడా నిరంతరాయంగా అమలు కావడం లేదు.. అదీ చాలదన్నట్లు ఇటీవల సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి..

Published : 10 Apr 2024 03:09 IST

అప్రకటిత కోతలతో అవస్థలు
పంటలు కాపాడలేమంటూ అన్నదాత ఆవేదన
న్యూస్‌టుడే, చిత్తూరు(మిట్టూరు)

నెల రోజులుగా ఏడు గంటలే విద్యుత్తు సరఫరా చేస్తున్నారు.. అదీనూ ఎక్కడా నిరంతరాయంగా అమలు కావడం లేదు.. అదీ చాలదన్నట్లు ఇటీవల సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి.. ఏ ఫీడర్‌ చూసినా అదే పరిస్థితి.. ప్రతిరోజూ సరఫరాలో పలుమార్లు అంతరాయం ఏర్పడుతోందని రైతులు చెబుతున్నారు.. కొన్ని ఉప కేంద్రాల పరిధిలో ఈఎల్‌ఆర్‌ పేరిట సూచించిన సమయంలోనూ సరఫరా నిలిపేస్తున్నారంటూ అన్నదాతలు వాపోతున్నారు.. ఓవైపు సూర్యుడు భగభగ.. మరోవైపు కోతలతో పంటలను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నామని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

9 గంటలంటూ ఆర్భాటమే..

వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్తు సరఫరా అంటూ ప్రభుత్వ ఆర్భాటమే తప్ప.. క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. 9 గంటల విద్యుత్తు సరఫరాను కుదించి ప్రస్తుతం ఏడు గంటలే ఇస్తున్నారు. ఉత్పత్తి, డిమాండు, సరఫరా మధ్య చాలా అంతరం ఉంది. ఫలితంగా లోటు ఏర్పడింది. మరోవైపు వాతావరణంలో మార్పుతో ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతుండటం, పంటలకు నీటి వినియోగం మరింత పెరిగింది.

ఎడాపెడా..

జిల్లాలో 3.07లక్షల వ్యవసాయ సర్వీసులు ఉన్నాయి. జిల్లాలో వరి, వేరుసెనగతో పాటు టమాటా, పండ్ల తోటలు, కూరగాయల పంటలు  సాగు చేపట్టారు.  1.30 లక్షల ఎకరాల్లో మామిడి పంట పిందె దశలో ఉంది. ఈ సమయంలో నీరు అవసరం. ఎడాపెడా కోతలతో వరి, ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయి. శ్రమకోర్చి, అప్పులు చేసి సాగుకు పెట్టుబడులు పెట్టామని అవి ఎండిపోకుండా విద్యుత్తు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.

చిత్తూరు మండలం కన్నికాపురంలో కరెంటు కోసం ఎదురుచూస్తున్న రైతు కుమార్‌

అడుగడుగునా నిరీక్షణే..

వ్యవసాయ సర్వీసులకు ఏడు గంటల సరఫరా నిమిత్తం ఏ, బీ గ్రూపులుగా విభజించి.. విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. ఏ గ్రూప్‌లో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, బి గ్రూప్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సరఫరా చేయాల్సి ఉంది. ఇటీవల విద్యుత్తు శాఖ చిత్తూరు అర్బన్‌, రూరల్‌, పలమనేరు, పుంగనూరు, పీలేరు డివిజన్ల పరిధిలోని పలు మండలాల్లో అప్రకటిత కోతలు మరింతగా పెరిగాయి. సరఫరా ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి. బోరు బావుల వద్దే నిరీక్షిస్తూ పంటలను కాపాడుకుంటున్నామని రైతులు చెబుతున్నారు.


సరఫరాలో కుదింపు..

వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా 9 గంటల నుంచి 2 గంటలు కుదించి.. కేవలం 7 గంటలే సరఫరా చేస్తున్నారు. సాధారణంగా వేసవిలో అత్యవసర లోడ్‌ రిలీఫ్‌(ఈఎల్‌ఆర్‌) పేరిట కోతలు విధిస్తుంటారు. వైకాపా ప్రభుత్వంలో వేసవి ప్రారంభానికి ముందుగానే ఫిబ్రవరి నెల నుంచే ఈ కోతలు మొదలయ్యాయి. పవన, సౌర విద్యుత్తు ఉత్పత్తి తగ్గడం, ముందస్తు ప్రణాళికలు లేకపోవడం తదితర కారణాలతో కోతలు అనివార్యమవుతున్నాయి. వీటిపై సంబంధిత అధికారులను అడిగితే సరైన సమాధానం లేదని రైతులు పేర్కొంటున్నారు.


కన్నీటి కష్టమిలా..

మరో నాలుగైదు నీటి తడులు అందిస్తే వరి పంట చేతికి వస్తుందని భావిస్తున్న తరుణంలో విద్యుత్తు కష్టాలను రైతులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంట కాపాడుకునేందుకు పెద్దపంజాణి మండలం కొళత్తూరు చెరువులో రైతులు కిరోసిన్‌, పెట్రోలు పంపులు ఏర్పాటు చేసుకొని వంతుల వారీగా నీటి తడులు అందిస్తున్నారు.

న్యూస్‌టుడే, పెద్దపంజాణి


నీటి తడులకు కష్టం..
- గిరిబాబు, కుక్కలపల్లె, యాదమరి మండలం

రెండెకరాల్లో కూరగాయలు, వరి సాగు చేశా. వ్యవసాయానికి 9 గంటలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా అమలు చేయడం లేదు. ఇప్పుడేమో ఏడు గంటలపాటు ఒకేసారి సరఫరా చేయడం లేదు. ఎడాపెడా కోతలతో పంటలకు నీటి తడులు ఇవ్వలేకపోతున్నాం. పంటను కాపాడుకోవడానికి కష్టంగా ఉంది.


సరఫరా అధ్వానం..
- సుకుమార్‌, పేయనపల్లి, గుడిపాల మండలం

గత కొద్ది రోజులుగా సరఫరా అధ్వానంగా ఉంది. తొమ్మిది గంటలు ఇస్తామన్న ప్రభుత్వం.. ప్రస్తుతం ఏడు గంటల సరఫరా సైతం గగనమైంది. పంటలకు నీటి తడులు ఇవ్వడం కష్టంగా మారింది. పదెకరాల్లో వరి, పెసలు, ఉద్దులు సహా మామిడి తోట ఉంది. ప్రస్తుతం నీటి అవసరం వీటికి ఎక్కువ. తరచూ సరఫరాలో అంతరాయం వల్ల అవస్థ పడుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని